మొబైల్ టికెటింగ్‌తో సమయం ఆదా

27 Dec, 2014 22:18 IST|Sakshi

రైల్వే మంత్రి సురేష్ ప్రభు

సాక్షి, ముంబై: మొబైల్ టికెటింగ్ విధానంతో లోకల్ రైళ్లలో ప్రయాణించేవారికి సమయం చాలా ఆదా అవుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దాదర్ రైల్వే స్టేషన్‌లో శనివారం లోకల్ ‘మొబైల్ టికెటింగ్’ విధానాన్ని  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ ముంబైలోని లోకల్ రైళ్లను ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారన్నారు. కాగా, వీరు గంటల తరబడి క్యూలో నిలబడే అవసరం లేకుండా సులభంగా టికెటు పొందేందుకు ఈ మొబైల్ టికెటింగ్ విధానం ఉపయోగపడుతుందన్నారు.

త్వరలోనే సీఎస్టీ, కుర్లా, ఠాణే, కల్యాణ్ తదతర కీలక స్టేషన్లలో ఈ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్, విండోస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించేవారు డౌన్ లోడ్ చేసుకునే అవకాశముంటుందని చెప్పారు. వినియోగదారుడు తొలుత అప్లికేషన్‌ను ఓపెన్ చేసి పేరు, మొబైల్ నంబర్, ముంబై సిటీ నమోదుచేసిన తర్వాత ఎస్సెమ్మెస్ ద్వారా  అతనికి ఒక పాస్ వర్డ్ వస్తుందన్నారు. అప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వినియోగదారుడి పేరు నమోదు అవుతుందని చెప్పారు.

అనంరతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం, ఫస్ట్, సెకండ్ క్లాస్ తదితర వివరాలు అందులో కనిపిస్తాయని, ఆ ప్రకారం నమోదు చేయడం పూర్తయితే మనం టికెటు పొందినట్లు మెసేజ్ వస్తుందన్నారు. దానిమేరకు మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని ఆయన వివరించారు. జీరో బ్యాలన్స్‌తో మన పేరు రిజస్టర్ అయినప్పటికీ టికెటు పొందాలంటే అందులో రూ.100 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ బ్యాలెన్స్‌ను భర్తీ చేసుకునేందుకు ప్రస్తుతం దాదర్‌లో మాత్రమే సౌకర్యం కల్పించినట్లు ఆయన చెప్పారు.

కార్యక్రమంలో ముంబై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సుభాష్ దేశాయ్, మేయర్ స్నేహల్ అంబేకర్, ఎంపీలు రాహుల్ శేవాలే, అనిల్ దేశాయ్, సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్‌కుమార్, పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.టండన్, రైల్వే బోర్డు సభ్యుడు సంజయ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు