స్నేహానికి వ్యాపారాన్ని ముడిపెట్టలేను 

15 Nov, 2023 00:08 IST|Sakshi
స్వాతీ రెడ్డి గునుపాటి, సురేశ్‌ వర్మ

స్వాతీరెడ్డి గునుపాటి 

పాయల్‌ రాజ్‌పుత్, అజ్మల్‌ అమర్‌ ప్రధాన పాత్రధారులుగా, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్‌ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్‌ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మంగళవారం’. అజయ్‌ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్‌ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్‌పై స్వాతీరెడ్డి గునుపాటి (వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ కుమార్తె), ఎం. సురేష్‌ వర్మ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రనిర్మాతలు మాట్లాడారు.

స్వాతీరెడ్డి గునుపాటి మాట్లాడుతూ – ‘‘అజయ్‌ భూపతిగారు చెప్పిన ‘మంగళవారం’ కథ విని, ఈ సినిమా చేస్తే బాగుంటుందనిపించి చేశాను. ఓ సెన్సిటివ్‌ ఇష్యూని ఆయన సందేశాత్మకంగా చెప్పిన విధానం నాకు నచ్చింది. పాయల్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడింది. అజనీష్‌ మ్యూజిక్‌ బాగుంటుంది. ఇండస్ట్రీలో నాకు అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌.. ఇలా అగ్రతారలతో పరిచయం ఉంది. నేను అడిగితే వారు నాతో సినిమాలు చేస్తారు. కానీ నిర్మాతగా ముందు నన్ను నేను నిరూపించుకోవాలి.

వాళ్ల స్థాయికి తగ్గ సినిమాలను నిర్మించే అవకాశం ఉన్నప్పుడు వారితో నేను సినిమాలు చేస్తాను. ఎందుకంటే స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం ఇష్టం లేదు’’ అన్నారు. మరో నిర్మాత సురేష్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్‌.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజు నుంచే అల్లు అర్జున్‌గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక చిన్నతనం నుంచి చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన మా ట్రైలర్‌ను విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు.

మరిన్ని వార్తలు