స్నేహితులను ఆహ్వానించను

21 Jan, 2015 05:02 IST|Sakshi
స్నేహితులను ఆహ్వానించను

 ఇకపై తన సినిమా వేడుకలకు స్నేహితులను ఆహ్వానించనంటున్నారు నటుడు, నిర్మాత విశాల్. తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తాజాగా నిర్మించి, నటించిన చిత్రం ఆంబళ. సంక్రాంతికి తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రజాదరణ పొందడంతో సోమవారం వడపళనిలోని హోటల్లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. విశాల్ మాట్లాడుతూ ఆంబళ చిత్రం విజయవంతమవడం ఒక ఎత్తు అయితే తన కోరికను నెరవేర్చిన చిత్రంగా చాలా సంతోషం కలిగించిందన్నారు. ఈ విజయాన్ని ఇంతకుముందే జరుపుకోవాల్సి ఉన్నా జరగలేదన్నారు.
 
  2012లో సుందర్‌సి దర్శకత్వంలో తాను నటించిన మదగజరాజ (ఎంజిఆర్) చిత్రాన్ని అప్పట్లో సంక్రాంతికి విడుదల చేయాలని కోరుకున్నామన్నారు. ఆ చిత్ర విడుదల అనివార్య కారణాల వలన వాయిదా పడటంతో ఆ బాధ ఇప్పటి వరకు తనను వెంటాడుతూ వచ్చిందన్నారు. ఈ సంక్రాంతికి విడుదలై తన కోరికను తీర్చిన చిత్రం ఆంబళ అని అన్నారు. మరో విషయం ఏమిటంటే సంక్రాంతికి ఇతర చిత్రాలు ఏమేమి విడుదల కానున్నాయన్న విషయం నిజంగా తనకు తెలియదన్నారు. అలాంటిది ఎవరినైనా నరుక్కుంటూ పోతాను అని తాను అన్నట్టు ఆర్య ప్రచారం చేశారన్నారు. తానలా అనలేదన్నారు.
 
 ఇంతకుముందు నటి లక్ష్మీమీనన్‌తో కలుపుతూ నటుడు విష్ణు విశాల్ నాన్ శిగప్పు మనిదన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై చెప్పి వదంతులకు ఆస్కారం కలిగించారన్నారు. అందుకే ఇకపై తన సినిమా వేడుకలకు తన స్నేహితులను ఆహ్వానించనని అన్నారు. తదుపరి చిత్రాల వివరాలను తెలుపుతూ ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నానని ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో సండకోళి-2 చిత్రం చేయనున్నట్లు వెల్లడించారు. దర్శకుడు సుందర్ సి మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో విశాల్‌తో ఉలగం చుట్రు వాలిబర్ చిత్రం తరహాలో బ్రహ్మాండమైన చిత్రం చేయనున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు