ఉత్కంఠ

8 Oct, 2016 01:16 IST|Sakshi

• రాజ్‌భవన్‌లో రాష్ట్ర మంత్రులు
• గవర్నర్ విద్యాసాగర్ రావుతో చర్చలు
• రెండుసార్లు వెళ్లిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు
• కావేరీ వివాదంపైనేనని రాజ్‌భవన్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ అది చెన్నైలోని గిండి. అక్కడే రాష్ట్ర గవర్నర్ నివసించే రాజ్‌భవన్. ప్రశాంత వాతావరణం. అకస్మాత్తుగా పోలీసుల హడావుడి. రాజ్‌భవన్ వద్ద సెక్యూరిటీ అలర్ట్. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు కారు రాక. 35 నిమిషాల తరువాత సీఎస్ నిష్ర్కమణ. యథావిధిగా ప్రశాంతం. సాయంత్రం 6.10 గంటల వేళ మళ్లీ పోలీసుల హడావుడి.
 
రాజ్‌భవన్ ప్రవేశద్వారంలో పోలీసుల మోహరింపు. ఎవరొస్తున్నారోనని ఎదురుచూపులు. మంత్రులు పన్నీర్ సెల్వం, ఎడపాడి పళనిస్వామితోపాటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు రాజ్‌భవన్‌లోకి మళ్లీ ప్రవేశం. 30 నిమిషాలపాటు సమాలోచనలు. ఇక అంతే పుకార్లు షికారు చేశాయి. అమ్మ అనారోగ్యంపై ప్రభుత్వం అప్రమత్తమైంది.. కాదు సీఎంకు సుస్తీ చేసినందున ఉప ముఖ్యమంత్రి పదవిని సిద్ధం చేయనున్నారు.. అదేం లేదు మంత్రి వర్గాన్ని పునర్వవ్యస్థీకరించి తాత్కాలికంగా సీఎం పదవిని సీనియర్ మంత్రికి అప్పగిస్తారు...ఇలా సుమారు ఐదు గంటలపాటు ఉత్కం ఠ భరిత వాతావరణం నెలకొంది.
 
మరికొద్ది సేపట్లో రాజ్‌భవన్ ఒకప్రకటన చేయనుంది, అప్పటి వరకు ఓర్పు వహించండని ఓదార్పు మాటలు. అపోలో ఆసుపత్రిలో సీఎం జయలలిత గత 16 రోజులుగా చికిత్స పొందుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా గవర్నర్‌తో మంత్రులు, ప్రధాన కార్యదర్శి సమావేశం కావడం నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది.
 
కావేరీ కోసమే.. కావేరీ జలాల వివాదంపై చర్చించేందుకు హైలెవల్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించినట్లు శుక్రవారం రాత్రి రాజ్‌భవన్ ప్రకటించడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కావేరీ అంశంతోపాటూ సీఎం జయలలిత ఆరోగ్యం గురించి గవర్నర్ వాకబు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఎడతెగని ఉత్కంఠకు తెరపడింది.

 రాష్ట్రపతి పాలనకు పరిశీలన: స్వామి సూచన
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. ఆరునెలల పాటూ రాష్ట్రపతి పాలన విధించిన పక్షంలో జయలలిత సరైన వైద్యసహాయాన్ని అందుకుని సంపూర్ణఆరోగ్యంతో బైటపడగలరని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు