రాజకీయ చట్రంలో ‘రాజీవ్’ హంతకుల విడుదల

4 Mar, 2016 08:51 IST|Sakshi

చెన్నై : రాజీవ్ హత్య కేసు నిందితుల వ్యవహారం రాజకీయ చట్రంలో కొట్టుమిట్టాడుతోంది. మరోమారు వీరి విడుదల తెర మీదకు రావడంతో చర్చ బయలు దేరింది. చిత్తశుద్ది లేక కేంద్రం కోర్టులోకి బంతిని రాష్ట్ర ప్రభుత్వం నెట్టిందని ప్రతి పక్షాలు విమర్శించే పనిలో పడ్డాయి.  మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులు నళిని, మురుగన్, శాంతన్,పేరరివాలన్, జయశంకర్, రవిచంద్రన్, రాబర్ట్‌లకు ఉరి శిక్ష పడడం, తదుపరి యావజ్జీవంగా మారడం గురించి తెలిసిందే.

24 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వీరిని, ఇక నైనా విడుదల చేయాలంటూ తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్ద తు రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే, పాలకులు చెవిన ఆ గళం పడలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నం అవుతుండడంతో రాజకీయ చట్రంలోకి మళ్లీ రాజీవ్ హత్యకేసు నింధితుల విడుదల వ్యవహారం చేరి ఉన్నది. ఇన్నాళ్లు మౌన ముద్ర అనుసరించిన పాలకులు తాజాగా, విడుదల నినాదాన్ని అందుకుని ఉండటం చర్చకు దారి తీసి ఉన్నది.

రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదల వ్యవహారంలో కేంద్రం అభిప్రాయాన్ని కోరుతూ లేఖాస్త్రం సంధించి ఉండడం గమనార్హం. ఇది వరకు ఏ చిన్న విషయమైనా సరే సీఎం జయలలిత జోక్యం చేసుకుని కేంద్రానికి లేఖాస్త్రం సందించడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్ గళాన్ని అందుకుని, కేంద్రానికి లేఖ పంపించి ఉండటంతో రాజకీయ చదరంగంలోకి మరో మారు విడుదల వ్యవహారాన్ని చేర్చి ఉన్నారన్న విమర్శలు బయలు దేరి ఉన్నది.

ఇన్నాళ్లు మౌనం అనుసరించి, ఎన్నికల నోటిఫికేషన్ రోజుల వ్యవధిలో విడుదల కాబోతున్న సమయంలో ఈ నినాదాన్ని ప్రభుత్వం అందుకుని ఉండటం కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమేనన్న విమర్శలు, ఆరోపణలు బయలు దేరి ఉన్నాయి. ప్రభుత్వానికి చిత్త శుద్ది లేక పోగా, తామేదో చిత్తశుద్ధితో ఉన్నట్టు చాటుకునే యత్నంలో భాగంగానే తాజాగా విడుదల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చి ఉన్నారని మండి పడే వాళ్లే ఎక్కువ.

ఈ విషయంగా ఎండీఎంకే నేత వైగో పేర్కొంటూ,  ఇది ఎన్నికల నాటకంగా వ్యాఖ్యానించారు. విడుదల చేసి ఉంటే, ఎప్పడో చేసి ఉండాలని, ఇప్పుడే కపట నాటకంతో రక్తికట్టించేందుకు సీఎం జయలలిత సిద్ధం అయ్యారని మండి పడ్డారు. బీజేపీ నాయకురాలు వానతీ శ్రీనివాసన్ పేర్కొంటూ, చట్టపరం చిక్కుల్లో ఇరుక్కుని ఉన్న ఈ కేసును కేంద్రం నెత్తిన రుద్ది, లబ్ధిపొందే యత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుందని మండిపడ్డారు.

స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే సీఎం జయలలిత, ఇప్పుడు కొత్త బాణిలో ప్రధాన కార్యదర్శి ద్వారా లేఖాస్త్రం పంపించి ఉండటం గమనించాల్సిన విషయంగా పేర్కొన్నారు. విడుదలలో  చిత్త శుద్ది లేక, ఎన్నికల్లో లబ్ధికి ఈ కొత్త నాటకం ఎందుకో అని ప్రశ్నించారు. పీఎంకే నేత రాందాసు పేర్కొంటూ, రాజకీయ శాసనాల చట్టం 161 ఉపయోగించి వారిని విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా, దాన్ని ప్రయోగించకుండా కొత్త నాటకం రచించి ఉన్న అన్నాడీఎంకేకు ప్రజలు గుణపాఠం నేర్పేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.

ఇక, ఈ విడుదల వ్యవహారం లోక్ సభను సైతం తాకి ఉండడం గమనార్హం. అయితే, రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించడంతో, ఇక్కడున్న కాంగ్రెస్ వాదులు ఇరకాటంలో పడే పరిస్థితి. అదే సమయంలో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నందుకుగాను, విడుదల వ్యవహారం డీఎంకేను సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టినట్టు అయింది. ఇక, రాష్ట్ర ప్రభుత్వం తమ కోర్టులోకి విసిరిన బంతిని చాకచక్యంగా ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నట్టున్నారు.

అందుకే కాబోలు ఆ లేఖ పరిశీలనలో ఉన్నట్టు ప్రకటించి కాలం నెట్టుకువచ్చే పనిలో పడ్డట్టున్నారన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరి ఉన్నది. ఇంతకీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయాలని, తనకు ఉన్న అధికారంతో  వారిని విడుదల చేసి  చిత్తశుద్దిని నిరూపించుకోవాలని తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్దతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు