చనిపోతున్నానంటూ.. సెల్ఫీ తీసి పంపాడు

3 Feb, 2017 16:19 IST|Sakshi
చనిపోతున్నానంటూ.. సెల్ఫీ తీసి పంపాడు

పుణె: పుణెలో ఇటీవల మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ దారుణ హత్యకు గురైన సంఘటనను మరచిపోకముందే నగరంలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గురువారం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న 23 ఏళ్ల ఉద్యోగి సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాంగ్రియా మెగాపాలిస్ సొసైటీలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో.. చనిపోయేముందు దుప్పటితో మెడకు చుట్టుకుని సెల్ఫీ తీసుకున్నాడు. దీన్ని ఓ స్నేహితుడికి పంపాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడ్ని అభిషేక్ కుమార్గా గుర్తించారు.

అభిషేక్ సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్. ఎనిమిది లేదా తొమ్మిది నెలల క్రితం టీసీఎస్లో ఉద్యోగంలో చేరాడు. స్నేహితులతో కలసి త్రీ బెడ్‌ రూమ్ ఫ్లాట్‌లో అద్దెకు ఉండేవాడు. ఒక్కో గదిలో ఇద్దరు చొప్పున ఉండేవారు. అభిషేక్ తన రూమ్మేట్‌ బయటకు వెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో అభిషేక్ స్నేహితులు ఫ్లాట్‌లోనే వేరే గదుల్లో ఉన్నారు.

ఇంతలో అభిషేక్ స్నేహితుడు వాళ్లకు ఫోన్ చేసి సెల్ఫీ విషయం చెప్పాడు. వాళ్లు వెంటనే బెడ్ రూమ్‌ తలుపు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ అభిషేక్ కనిపించాడు. అతణ్ని కిందకు దించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. కాసేపటి తర్వాత అభిషేక్ మరణించినట్టు వైద్యులు చెప్పారు. కాన్పూర్లోని అతని కుటుంబ సభ్యులకు రూమ్మేట్స్ విషయం తెలియజేశారు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అభిషేక్ ఇలా చేస్తాడని తాము ఊహించలేదని అతని రూమ్మేట్స్ పోలీసుల విచారణలో చెప్పారు.

మరిన్ని వార్తలు