అక్కినేని పేరిట పురస్కారం

21 Sep, 2014 03:58 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  నట దిగ్గజం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట కర్ణాటకలోని నటులకు ఇక ఏటా అవార్డును ఇవ్వనున్నట్లు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు, ఏకే. జయచంద్రా రెడ్డి తెలిపారు. ఇక్కడి వయ్యాలికావల్‌లోని సమితి ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన అక్కినేని 91వ జయంతి సభలో వారు  ప్రసంగించారు.

ఆయన వస్త్రధారణ పదహారణాల తెలుగుదనానికి సంకేతమని కొనియాడారు. వృత్తిని దైవంగా భావించిన ఆయన అన్ని కాలాల వారికి ఆదర్శప్రాయుడని అన్నారు. తాను చదువుకోకపోయినా, ఇతరులు, ముఖ్యంగా పేదలు చదువుకోవాలనే సదుద్దేశంతో గుడివాడలో కళాశాలను స్థాపించారని గుర్తు చేశారు.

తద్వారా ఎంతో మందికి విద్యా దానం చేశారని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అందరికీ చాటి చెప్పిన నట శిఖరం అక్కినేని అని పేర్కొన్నారు. ఆయన నటించిన అనేక చిత్రాలను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారని తెలిపారు. దేవదాసు, కాళిదాసు పాత్రల్లో ఆయన నటన నభూతో నభవిష్యతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి సీవీ. శ్రీనివాసయ్య, పూర్వ ప్రధాన కార్యదర్శి కే. గంగరాజు ప్రభృతులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు