త్వరలో ప్రీపెయిడ్ ఆటో బూత్‌లు

3 Mar, 2014 22:53 IST|Sakshi

 సాక్షి, ముంబై: దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను దోచుకుంటున్న ఆటోడ్రైవర్ల ఆగడాలకు కళ్లెం వేయాలని ట్రాఫిక్ శాఖ యోచిస్తోంది. మొదటి విడతలో లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ), బాంద్రా టర్మినస్, అంధేరి, కల్యాణ్ తదితర ప్రధాన రైల్వేస్టేషన్ల బయట ప్రీ పెయిడ్ ఆటో బూత్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే ఆటో డ్రైవర్ల ఇష్టారాజ్యం, దాదాగిరి, అడ్డగోలుగా చార్జీల వసూలు, మోసం చేయడం లాంటి ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు విముక్తి లభించనుంది. నగరంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), ముంబై సెంట్రల్, దాదర్ లాంటి కీలకమైన రైల్వే స్టేషన్ల బయట ట్రాఫిక్ శాఖ ప్రీ పెయిడ్ ట్యాక్సీ బూత్‌లను ఇదివరకే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి కారణంగా ప్రయాణికులకు సరైన సేవలు అందుతున్నాయి.

ఇదే తరహాలో ఆటో ప్రీపెయిడ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రధాన రైల్వే స్టేషన్ల బయట స్థలం సమస్య ఏర్పడుతోంది. కానీ ప్రీ పెయిడ్ ఆటోబూత్‌లు ఏర్పాటుచేసేందుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చేందుకు రైల్వే పరిపాలన విభాగం అంగీకరించింది. కాగా, అవసరమైన స్థలాన్ని సమకూర్చి ఇవ్వాలని సెంట్రల్, పశ్చిమ రైల్వే పరిపాలన విభాగాలకు విజ్ఞప్తిచేయగా అందుకు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ట్రాఫిక్ శాఖ వర్గాలు తెలిపాయి. స్థలం లభించిన వెంటనే బూత్‌లు ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

 సాధారణంగా స్వగ్రామాల నుంచి పిల్లలు, భారీ లగేజీలతో రైలు దిగిన ప్రయాణికులకు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో లేదా ట్యాక్సీ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయటకు రాగానే, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు ధరలు చెబుతారు. దగ్గర కిరాయికి రారు. ఒకవేళ  వచ్చినా వారు అడిగినంత చెల్లించాల్సిందే.  ఇక ప్రీ పెయిడ్ బూత్‌లు అందుబాటులోకి వస్తే వీరి ఆగడాలకు కచ్చితంగా కళ్లెం పడుతుందని ట్రాఫిక్ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు