అడ్మిషన్లకు కొత్త విధానం

6 May, 2014 22:16 IST|Sakshi

 సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీ అడ్మిషన్ల కోసం వచ్చే ఏడాది నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.  ఒకే వయస్సు (యూనిఫాం) చిన్నారులకు మాత్రమే సంబంధిత తరగతిలో అడ్మిషన్లు ఇవ్వడానికి విద్యాశాఖ డెరైక్టరేట్ ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోర్డుల్లో ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు. విద్యాశాఖ కమిషనర్ చోకలింగం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కో పాఠశాలకు ఒక్కో తరహా వయోపరిమితిని విధించడం వల్ల విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం వర్తించే 25 శాతం కోటాను అమలు చేయడానికి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. చోకలింగంతోపాటు మరికొంత మంది ప్రాఠశాలల ప్రతినిధులు సోమవారం ఉదయం ఈ విషయమై చర్చించారు. అయితే ఇప్పటి నుంచి అన్ని పాఠశాలలూ ఏజ్ లిమిట్ (వయోపరిమితి)ని పాటించాలని నిర్ణయించారు. రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో అభ్యర్థి ఎంచుకున్న పాఠశాలలో అతడు/ఆమె తరగతికి వయోపరిమితి సరిపోతేనే దరఖాస్తు ఫారం స్వీకరిస్తామని చోకలింగం అన్నారు.

 అయితే ఇది ఈ సమస్యను పరిష్కరించేందుకు కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్డుల్లో ఏకీకృత విధానం పాటించడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తాము అన్ని పాఠశాలల ప్రతినిధులను సంప్రదించి ఈ విషయమై చర్చిస్తామని, తదనంతరం అమలును తనిఖీ చేస్తామన్నారు. నర్సరీ, జూనియర్ కిండర్‌గార్టెన్ (కేజీ), సీనియర్ కేజీ తరగతుల కోసం ఖచ్చితమైన వయోపరిమితిని విధిస్తామని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలలూ ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని చోకలింగం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు