నేడు క్రిస్మస్

25 Dec, 2014 02:35 IST|Sakshi
నేడు క్రిస్మస్

 టీనగర్: యేసుక్రీస్తు పుట్టిన రోజైన క్రిస్మస్ పండుగను నేడు క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ ఆలయాల్లో బుధవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రీస్తు పుట్టుక గురించి మత బోధకులు సందేశాలను అందించారు. అదేవిధంగా భక్తులకు మతబోధకులు ఆశీస్సులను అందజే శారు. ఇందులో భాగంగా క్రిస్మస్ వేడుకలకు నగరం ముస్తాబైంది. నగరంలోని టీనగర్, మైలాపూరు, ప్యారిస్, పెరంబూరు, శాంతోమ్, సెంట్ థామస్ మౌంట్, ఎగ్మూరు, తిరువాన్మియూరు, అడయారు, అన్నానగర్, తాంబరం, వలసరవాక్కం, వ్యాసర్పాడి, కొడుంగయూరు, మాధవరం తదితర ప్రాంతాలలోని చర్చిలు విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్నాయి.
 
 రంగురంగుల విద్యుత్ దీపాలు క్రిస్మస్ ప్రత్యేకతను వివరించే అలంకరణలు చేపట్టారు. యేసు క్రీస్తు పుట్టుకను తెలియపరిచే రీతిలో పశువుల పాకలను, వివిధ ఘట్టాలను అనేక  మందిరాల్లో ఏర్పాటుచేశారు. చెన్నైలో ప్రత్యేక ప్రార్థనల కోసం కాథలిక్, సీఎస్‌ఐ, ఈఎస్‌ఐ, బాప్టిస్ట్, టీఇఎల్‌సి తదితర ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. శాంతాక్లాస్ వేషధారణలతో పలువురు భక్తులను అలరించారు. అనేక మంది భక్తులు బృందాలుగా విడిపోయి వీధుల్లో క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ప్రార్థనలు ముగిసిన వెంటనే భక్తులు ఒకరికొకరు మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా అనేక ఆలయాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. రాత్రంతా నగర వ్యాప్తంగా పోలీసు గస్తీ తిరగాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. క్రిస్మస్ సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు