రెండు దశాబ్దాల తర్వాత..

10 Dec, 2014 22:26 IST|Sakshi

సంప్రదాయాలకు విరామం
ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత లేకుండా శీతాకాల సమావేశాలు
సమావేశాలకు ముందు అధికారపక్షంలో చేరిన శివసేన
ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్, ఎన్సీపీ హోరాహోరీ

 
సాక్షి ముంబై: రాష్ర్టంలో ఈసారి శీతాకాల సమావేశాలు ఉపముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు లేకుండా జరుగుతుండటం విశేషం. 20 ఏళ్ల అనంతరం ఉపముఖ్యమంత్రి లేకుండా ఈ సమావేశాలకు నాగపూర్ వేదికకావడం విశేషంగా చెప్పుకోవచ్చు. 1995-99 మధ్య కాలంలో శివసేన-బీజేపీల కాషాయ కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పరంపర కొనసాగుతూ వచ్చింది. అయితే  ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఒంటరిగా పోరాడాయి. ఎవరికీ పూర్తి మద్దతు లభించకపోయినప్పటికీ 122 స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మళ్లీ మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలు ఒక్కటయ్యాయి.

అయితే ఉపముఖ్యమంత్రి పదవి మాత్రం ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న శివసేన శీతాకాల సమావేశాలకు ఒక రోజు ముందు ప్రభుత్వంలో భాగస్వామిగా మారడంతో ఈసారి ప్రతిపక్ష నాయకుడు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు 2012లో ఉపముఖ్యమంత్రి లేకుండా సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైనప్పటికీ చివరి క్షణంలో మళ్లీ అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ సమయంలో జలవనరుల కుంభకోణంపై ఆరోపణలు రావడంతో ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ఉపముఖ్యమంత్రి ఖాళీ అయింది. ఈ పదవిని భర్తీ చేయరని భావించినప్పటికీ శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందు భర్తీ చేసి ఆ సమావేశాల్లోనే ప్రమాణస్వీకారం చేశారు.

1978 నుంచి డిప్యూటీ సీఎం...
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1978లో ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించారు. ఆ సమయంలో ఎస్ కాంగ్రెస్‌కు చెందిన వసంత్‌దాదా పాటిల్ ముఖ్యమంత్రి ఉండగా ఉపముఖ్యమంత్రిగా ఇందిరా కాంగ్రెస్‌కు చెందిన నాశిక్‌రావ్ తిరపుడే బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఉపముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్‌కు చెందిన రామారావ్ అధిక్‌కు లభించింది. ఆయన వసంత్‌దాదా పాటిల్‌తోపాటు శరద్‌పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రామారావ్ అధిక్ అనంతరం మళ్లీ కాంగ్రెస్‌లో ఎవరికి ఉపముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టే గౌరవం లభించలేదు. 15 ఏళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎవరికీ ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదు. అనంతరం శివసేన-బీజేపీ కాషాయ కూటమి అధికారంలోకి వచ్చింది.

ఆ సమయంలో శివసేనకు చెందిన మనోహర్ జోషీ ముఖ్యమంత్రిగా ఉండగా దివంగత బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. నాలుగేళ్ల అనంతరం శివసేనకు చెందిన నారాయణ రాణే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ ఉపముఖ్యమంత్రిగా మాత్రం గోపీనాథ్ ముండేనే కొనసాగారు. అదే సమయంలో శరద్‌పవార్ కాంగ్రెస్‌నుంచి విడిపోయి నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అలాగే శివసేన  ప్రముఖ నాయకుడైన ఛగన్‌భుజ్‌బల్ తిరుగుబాటు బావుట ఎగురవే సి ఎన్సీపీలో చేరిపోయారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీల డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టగా, ఎన్సీపీలో చేరిన ఛగన్ భుజ్‌బల్‌కు ఉపముఖ్యమంత్రి పదవి లభించింది.

2003లో ఎన్సీపీకి చెందిన విజయ్‌సింగ్ మోహితేపాటిల్, 2004లో ఎన్సీపీకి చెందిన ఆర్ ఆర్ పాటిల్‌లు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న  విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌తోపాటు ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆర్ ఆర్ పాటిల్ రాజీనామా చేయాల్సివచ్చింది. దీంతో మరోసారి ఛగన్‌భుజ్‌బల్‌కు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లభించింది. 2009 ఎన్నికల్లో తిరిగి డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది.

ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2012లో శీతాకాల సమావేశాలకు ముందు కొన్నిరోజులపాటు అజిత్‌పవార్ రాజీనామా చేసి, చివరిక్షణంలో మళ్లీ పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈసారి  ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రి పదవిని ఎవరికీ కట్టబెట్టలేదు. దీంతో 20 యేళ్ల అనంతరం మరోసారి శీతాకాల సమావేశాలు ఉపముఖ్యమంత్రి లేకుండా జరుగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు