యతీందర్‌ది హత్యా ... ఆత్మహత్య

1 Jul, 2014 03:05 IST|Sakshi
  • కొద్ది రోజుల క్రితం పెనుకొండ వద్ద కాలిపోయిన స్థితిలో మృతదేహం గుర్తింపు
  •  దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
  •  
     బెంగళూరు : కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లా సరిహద్దు వద్ద ఓ కారులో కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన అమృతహళ్లి పోలీసులు హతుడు మహారాష్ట్రకు చెందిన యతీందర్  (34)గా గుర్తించి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన వివరాలు... యతీందర్ కుటుంబంతో ఇక్కడి అమృతహళ్లిలోని జక్కూరు లేఔట్‌లో నివాసం ఉంటున్నాడు. కాలేజీ రోజుల్లో నుంచే స్నేహితులు విజయ్, రాజ్‌తో కలిసి బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నాడు.

    ఇదిలా ఉంటే గతనెల 18న యతీందర్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న కారులో బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు యతీందర్ భార్య అమృతహ ళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్పటి నుంచి అతని కోసం గాలింపు చేపట్టారు. యతీందర్ తీసుకువెళ్లిన కారుకు కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు బాగే పల్లి వద్ద టోల్ చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్లిన కారు అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని సోమందేపల్లి వద్ద కాలిపోయిన స్థితిలో కనిపించింది.

    కారులో  కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ శవం ఉన్నట్లు సమాచారం అందుకున్న అమృతహళ్లి పోలీసులు అక్కడి చేరుకుని దర్యాప్తు చేశారు. అనంతరం యతీందర్ భార్యను సంఘటన స్థలానికి తీసుకు వచ్చారు. మృతదేహం తన భర్తదేనని గుర్తించింది. కారులో ఉన్న ల్యాప్‌టాప్, మొబైల్, డాక్యుమెంట్లు కాలిపోయాయి.

    ఇదిలా ఉంటే యతీందర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొన్ని గంటల తరువాత తన మొబైల్ నుంచి భార్యకు, బావమరిది అమిత్‌కు ‘మీరు ఇక్కడ ఉండొద్దు’ అని మెసేజ్‌లు పంపించాడు. అయితే ఆ మెసేజ్‌లో యతీందరే పంపించాడా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యతీందర్‌ను కారులో పెట్టి నిప్పటించి హత్య చేశారా ? లేక అతనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళతో యతీందర్ సన్నిహితంగా ఉండేవాడని పోలీసుల విచారణలో వెలుగు చేసింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆధారాలు బయటపడ్డాయని సమాచారం. ఆమే యతీందర్‌ను పెనుకొండకు రప్పించి హత్య చేసిందా లేక వ్యాపార లావాదేవీలు హత్యకు దారితీశాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మరిన్ని వార్తలు