డిగ్రీ కాలేజీల్లో 2,576 పోస్టులు

7 Nov, 2017 03:12 IST|Sakshi

     భర్తీకి ఆమోద ముద్ర వేసిన సీఎం కేసీఆర్‌ 

     1,192 బోధనేతర పోస్టులు కాగా, మిగతావి టీచింగ్‌ పోస్టులు 

     త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం      పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మరో 885 పోస్టుల భర్తీ!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2,576 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే వీటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత పోస్టుల భర్తీకి సంబంధించిన చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కళాశాల విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పాలిటెక్నిక్‌ కాలేజీల్లోనూ 885 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ పరిశీలనలో ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. డిగ్రీ కాలేజీల్లో పోస్టులకు సీఎం ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీకి త్వరలోనే గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించాయి. 

అధ్యాపక పోస్టులే అత్యధికం 
సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన 2,576 పోస్టుల్లో అధ్యాపక పోస్టులే అత్యధికంగా ఉన్నాయి. 15 ప్రిన్సిపాల్, 1,214 డిగ్రీ లెక్చరర్, 67 ఫిజికల్‌ డైరెక్టర్, 64 లైబ్రేరియన్, 24 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏవో) పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 1,192 బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం ఓకే చెప్పినట్లు తెలిసింది. 

14 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో..
మరోవైపు 14 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 686 పోస్టుల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో 320 బోధన సిబ్బంది పోస్టులు ఉండగా, 366 బోధనేతర సిబ్బంది పోస్టులు ఉన్నాయి. మరో 11 సెకండ్‌ షిప్ట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోనూ 199 పోçస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు కేటగిరీల కాలేజీల్లో 399 బోధన సిబ్బంది (లెక్చరర్‌) పోస్టులు ఉన్నాయి. వాటి భర్తీకి కూడా త్వరలోనే ఆమోదం లభించనుందని సాంకేతిక విద్యాశాఖ భావిస్తోంది. ఇందులో 90 శాతం పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుందని, 10 శాతం పోస్టులను పదోన్నతులపై భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు