కేసీఆర్ సభలో కలకలం

11 Aug, 2017 03:35 IST|Sakshi
సీఎం కేసీఆర్ సభలో కలకలం

భారీ కటౌట్‌ ఎక్కిన సర్పంచ్‌ భర్త

భీమ్‌గల్‌/మోర్తాడ్‌/కడెం: సీఎం కేసీఆర్‌ పోచంపాడ్‌లో గురువారం పాల్గొన్న బహిరంగ సభలో కలకలం రేగింది. సీఎం ప్రసంగం ముగుస్తుండగానే సభా వేదిక పక్కన ఏర్పాటు చేసిన ఆయన వంద అడుగులు భారీ కటౌట్‌పైకి ఓ సర్పంచ్‌ భర్తతో పాటు మరో మహిళ వేర్వేరు కారణాలతో ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం చివరి దశకు చేరుకుని ముగింపు పలుకుతున్న సమయంలో ఆదిలాబాద్‌ జిల్లా కడెం మండలం గంగాపూర్‌ సర్పంచ్‌ ఆరెంపల్లి శాంత భర్త చంద్రహాస్‌ కటౌట్‌ ఎక్కి, గ్రామ సమస్యలపై వినతిపత్రాన్ని సీఎం కేసీఆర్‌ వైపు చూపించాడు.

ఈ దశలో సీఎం ఇదేమీ పట్టించుకోకుండా సభను ముగించి తిరుగుముఖం పట్టారు. దీంతో బాధితుడు పై నుండే గొడవ చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే ఊహించని రీతిలో పోచంపాడ్‌కు చెందిన విజయలక్ష్మి సైతం కటౌట్‌ ఎక్కి, తనకు డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో దూకుతానని బెదిరించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు కానిస్టేబుళ్లు వారిని కిందకు దించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విజయలక్ష్మి చివరకు కిందకు దిగింది.

కానీ, చంద్రహాస్‌ మాత్రం తనకు స్పష్టమైన హమీ ఇచ్చే వరకు కిందికి దిగేది లేదని మొండికేసాడు. గ్రామ సమస్యలపై ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, గత్యంతరం లేక సర్పంచ్‌ భర్త ఇలా చేయాల్సి వచ్చిందని ఓ గ్రామస్తుడు వివరించాడు. గ్రామాన్ని రాష్ట్ర పోలీసు అధికారి దత్తత తీసుకున్నా పనులు చేయడం లేదని ఆరోపించాడు. దీంతో సీపీ కార్తికేయ ఆ అధికారితో తాను మాట్లాడుతానని చెప్పడంతో కిందికి దిగాడు.

మరిన్ని వార్తలు