కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుకు తాత్కాలిక బ్రేక్

22 Mar, 2014 00:20 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ-ఫారాలు ఎట్టకేలకు సిట్టింగు ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నుంచి శుక్రవారం బీ-పారాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అందాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగులకే మరోసారి ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రకటించటం... ఆ వెంటనే బీ ఫారాలు ఎమ్మెల్యేలకు అందజేయడం గమనార్హం.

 జిల్లాలో  దాదాపు అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆదిపత్య పోరు ఉంది. వైరి వర్గాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలల్లో టికెట్‌ను ఆశిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కీలక భూమిక పోషిస్తారు.ఈ నేపథ్యంలో తన అనుచరులకు, అనుయాయులకే స్థానిక సంస్థల బీ-ఫారం ఇప్పించుకోవడానికి  ఎమ్మెల్యే ఆశావాహా నేతలు పోటీ పడ్డారు. ఎవరి స్థాయిలో వాళ్లు పైరవీలు చేసుకున్నారు. వర్గ విభేదాలు తీవ్రంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధినాయకత్వం రంగంలోకి దిగి రెండు వైరి వర్గాల వారిని రాజీ చర్చలకు పిలిచి చెరికొన్ని బీ-ఫారాలు పంచుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో ఎమ్మెల్యేలకు కొంత ఊరటనిచ్చింది.  

 ఖర్చు బాధ్యత ఎమ్మెల్యేలకే?
 స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అయ్యే ఖర్చును ఎమ్మెల్యేలే భరించాలని కాంగ్రెస్ అధి నాయకత్వ సూచించినట్టు తెలిసింది. ఎక్కువ సీట్లు గెలిపించుకున్న వారికే తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, లేకుంటే ఆశలు వదులు కోవాలని కరాఖండీగా చెప్పి బీ- ఫారాలు చేతికి ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల్లో ఎంపీటీసీకి కనీసం రూ 4 లక్షలు, జెడ్పీటీసీకి రూ 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన ప్రతి ఎమ్మెల్యేకు స్థానిక సంస్థల ఎన్నికల్లో  రూ. 3 కోట్లు నుంచి 4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు