‘దీపం’ వెలుగుకు నగదు బదిలీ అడ్డంకి!

21 May, 2015 02:28 IST|Sakshi
‘దీపం’ వెలుగుకు నగదు బదిలీ అడ్డంకి!

ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి దూరంగా ఉన్న పేద కుటుంబాలు
3 జిల్లాల్లో ముగిసిన అదనపు గడువుతో మార్కెట్ ధర చెల్లించాల్సిన దుస్థితి

 
హైదరాబాద్: ‘దీపం’ వెలుగులకు గ్యాస్ నగదు బదిలీ పథకం అడ్డంకిగా మారింది. ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానంపై దీపం పథక లబ్ధిదారులకు అవగాహన లేకపోవడం వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 11 శాతం మంది గ్యాస్ నగదు బదిలీ పథకానికి దూరంగా ఉండగా అందులో 6 నుంచి 7 శాతం దీపం లబ్ధిదారులే ఉన్నారని ఆయిల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే రెండోసారి ఇచ్చిన అదనపు గడువు సైతం ముగిసిన నేపథ్యంలో మొదటి విడతలో నగదు బదిలీ ఆరంభమైన 3 జిల్లాలు.. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్‌లలోని దీపం లబ్ధిదారులు మార్కెట్ ధరను చెల్లించి సిలిండర్‌ను పొందాల్సి వస్తోంది.  
 
నగదు బదిలీకి దూరంగా 4 లక్షల మంది దీపం లబ్ధిదారులు!
 
కేంద్రం తీసుకొచ్చిన నగదు బదిలీ పథకంలో భాగంగా గ్యాస్ నంబర్‌కు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు అనుసంధాన అదనపు వెసలుబాటు గడువు మూడు జిల్లాల్లో ఈ నెల 14తో ముగిసింది. మిగతా ఏడుజిల్లాల్లో జూన్ చివరతో ముగియనుంది. ఇప్పటివరకు అందిన లెక్కల మేరకు రాష్ట్రం మొత్తంగా 89 శాతం మంది ఆధార్, బ్యాంక్ ఖాతాలను అనుసంధానించుకున్నా, మిగతా వారిలో మాత్రం ఎక్కువగా దీపం పథకం లబ్ధిదారులే ఉన్నారు. ముఖ్యంగా తొలి విడత నగదు బదిలీ మొదలైన మూడు జిల్లాల పరిధిలో ఆధార్ సీడింగ్  కలిపి చూస్తే ఆదిలాబాద్‌లో 90 శాతం, రంగారెడ్డిలో 88 శాతం, హైదరాబాద్‌లో 87 శాతం మేర జరిగినట్లు తెలుస్తోంది. జంట జిల్లాల్లో మొత్తం 29 లక్షల ఎల్పీజీ గృహ వినియోగదారులు ఉండగా, అందులో  నగదు బదిలీ పథకంలో  22.44 లక్షలు చేరగా, 6.56 లక్షల వినియోగదారులు దూరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో మరో 1.50 లక్షల మంది దూరంగా ఉన్నారని చెబుతున్నారు. గడువులోగా అనుసంధానానికి ముందుకురాని మొత్తం 8 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ రాయితీ ధరకు దక్కే అవకాశాల్లేవు. ఇందులో 4లక్షల మంది దీపం పథకం లబ్ధిదారులే ఉన్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
 
బాధ్యత పౌర సరఫరాల శాఖదే!
 
దీపం లబ్ధిదారులను నగదు బదిలీ పథకంలో చేర్పించాల్సిన బాధ్యత పూర్తిగా పౌర సరఫరాల శాఖ మీదే ఉందని పరిశీలకులు అంటున్నారు. శాఖా పరంగా దీపం లభ్ధిదారుల వివరాలు తెప్పించి మండల, జిల్లాల వారీగా పరిశీలించి అందులో ఆధార్, బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి, నగదు బదిలీ పథకంలో చేరేలా అవగాహన కల్పించే బాధ్యతను తీసుకుంటేనే నిరుపేదకు తగిన న్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.    

మరిన్ని వార్తలు