సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ!

21 Nov, 2023 07:02 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సొరంగం కూలిపోవడంతో 41 మంది కూలీలు గత 9 రోజులుగా దానిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలవంతం కావడం లేదు. ఇదిలా ఉండగా సోమవారం (నవంబర్ 20) ఆరు అంగుళాల కొత్త పైప్‌లైన్ ద్వారా మొదటిసారిగా బాధితులకు ఘన ఆహారాన్ని అధికారులు అందించగలిగారు. రెస్క్యూ టీమ్ ఈ పైపు ద్వారా వారికి బాటిళ్లలో వేడి కిచిడీని పంపింది. ఇన్ని రోజులుగా సరైన ఆహారం అందకపోవడంతో వారు నీరసించిపోయారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం హేమంత్ అనే కుక్‌ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం కిచిడీని తయారు చేశారు. కార్మికులకు వేడి వేడి ఆహారాన్ని పంపడం ఇదే తొలిసారి అని హేమంత్‌ తెలిపారు. తాము కిచిడీ మాత్రమే పంపుతున్నామని, తమకు అధికారులు చెప్పిన ఆహారాన్ని మాత్రమే వండుతున్నామని హేమంత్  పేర్కొన్నారు. 

బ్రహ్మఖల్-యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్‌లో కొంత భాగం నవంబర్ 12న కూలిపోయింది. చార్‌ధామ్ ప్రాజెక్ట్ కింద, బ్రహ్మఖల్- యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్‌గావ్ మధ్య ఈ సొరంగం నిర్మితమవుతోంది. నవంబర్ 12 తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం జరిగింది. 41 మంది కూలీలు లోపల చిక్కుకుపోయారు. 

రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారం పంపిస్తున్నామని, ఇందుకోసం వైద్యుల సహకారంతో చార్ట్‌ను సిద్ధం చేశామన్నారు. అరటిపండ్లు, యాపిల్స్, కిచిడీ, గంజి మొదలైనవి బాధితులకు పంపిస్తున్నామన్నారు. 
ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు
 

మరిన్ని వార్తలు