ఏసీబీ వలలో పెద్దచేప

17 Oct, 2017 15:02 IST|Sakshi

నాగర్‌కర్నూల్‌: మత్స్య సహకార సంఘం భవన నిర్మాణ విషయమై బిల్లు చెల్లింపు కోసం లంచం డిమాండ్‌ చేసి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా.. నాగర్‌కర్నూల్‌ జిల్లా మత్స్యశాఖ అధికారిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్‌ కథనం ప్రకారం.. కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లికి చెందిన పెద్దూరు లక్ష్మయ్య మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మొలచింతలపల్లికి మత్స్య సహకార భవనం కోసం ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయగా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం కొనసాగిస్తున్నారు.

 అయితే ఈ సంవత్సరం ప్రథమంలోనే పునాది వరకు పనులు పూర్తి కాగా అప్పుడు బిల్లు చేసే సమయంలో జిల్లా మత్స్య శాఖాధికారి నాగులు లంచం డిమాండ్‌ చేయగా బాధితుడు ఇవ్వలేదు. అయితే ఇటీవలే స్లాబ్‌ పూర్తి కాగా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పరిశీలించి పెద్దూరు లక్ష్మయ్యకు రూ.1,99,219 మంజూరు చేయాలని ఎంబీ రికార్డు నమోదు చేశారు. జిల్లా మత్స్య శాఖాధికారి నాగులు, పెద్దూరు లక్ష్మయ్య పేర ఉమ్మడి ఖాతా ఉండటంతో బిల్లు ఇవ్వాలని లక్ష్మయ్య సదరు అధికారిని కోరగా.. గతంలో ఎలాంటి డబ్బు ఇవ్వకుండా బిల్లు తీసుకున్నావని, ఇప్పుడు రూ.10 వేలు ఇస్తేనే చెక్కు ఇస్తానని తేల్చిచెప్పారు.

 రూ.10 వేలు ఇవ్వలేనని చెప్పడంతో రూ.8 వేలైనా ఇవ్వనిదే చెక్కు ఇవ్వనని పట్టుబట్టారు. దీంతో లక్ష్మయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కాగా ఏసీబీ అధికారులు సోమవారం మత్స్య శాఖ కార్యాలయం వద్ద మాటు వేశారు. నాగులు లక్ష్మయ్య వద్ద రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా అధికారి నాగులును ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ప్రభాకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు