అసమతుల్య ఆహారంతో గుండె జబ్బులు

24 Nov, 2019 03:50 IST|Sakshi
శనివారం జరిగిన వర్క్‌షాప్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న డాక్టర్‌ జి.ఎస్‌.రావు, డాక్టర్‌ హేమలత. చిత్రంలో డాక్టర్‌ రాజశేఖర్, డాక్టర్‌ పవన్, డాక్టర్‌ లలితారెడ్డి, డాక్టర్‌ శశికాంత్‌

గ్రామీణ ప్రాంత ప్రజల్లో పోషకాహార లోపం

పట్టణ ప్రాంతాల్లోని వారిలో అధిక కొవ్వు సమస్య

‘అడ్వాన్డ్స్‌ కార్డియాలజీ’ సదస్సులో వైద్యుల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అతి పిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడటానికి అసమతుల్య ఆహారం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడమే ప్రధాన కారణమని పలువురు హృద్రోగ వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో రెండ్రోజులపాటు జరగనున్న ‘అడ్వాన్డ్స్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ’ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత, యశోద హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ జీఎస్‌రావు, డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌గోరుకంటి, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ వరద రాజశేఖర్, డాక్టర్‌ లలిత సహా పలువురు వైద్యనిపుణులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పోషకాహార లోపంతో గుండె జబ్బుల బారిన పడుతుంటే.. పట్టణాల్లో మారిన జీవశైలికితోడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ జబ్బుల బారిన పడుతున్నట్లు తెలిపారు. 1990లో గుండె జబ్బుల మరణాలు 15% ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 28 శాతానికి పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఆర్థికంగా ఉన్నవారు శారీరక అవసరానికి మించి ఏది పడితే అది తింటూ పొట్ట చుట్టూ భారీగా కొవ్వును పోగేసుకుంటున్నారు. దీంతో బరువు పెరిగిపోతున్నారు. ఇది చిన్న వయసులోనే గుండె జబ్బులకు కారణమవుతోంది. పిజ్జాలు, బర్గర్లతో కడుపునింపుతున్నారు. భవిష్యత్తులో ఆరోగ్యం దెబ్బతినడానికి కారణమవుతుంది. మిత ఆహారం తీసుకోవడం, ఆహారంలో పండ్లు, కాయగూరలు, నట్స్‌ ఎక్కువ తీసుకోవడంతో పాటు వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి చేయడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చు. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’’అని డాక్టర్‌ హేమలత తెలిపారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం వల్ల గుండె జబ్బులు పెరిగాయని, విదేశీయుల్లో 60 ఏళ్లకు ఈ జబ్బులు వెలుగు చూస్తుంటే, మన దగ్గర 35 ఏళ్లకే వెలుగు చూస్తున్నాయని డాక్టర్‌ రాజశేఖర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరంలో అత్యాధునిక వైద్యసేవలులతోపాటుగా నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు విదేశాలతో పోలిస్తే ఇక్కడ వైద్య ఖర్చు కూడా చాలా తక్కువని, ప్రస్తుతం 30 దేశాల రోగులు చికిత్సల కోసం నగరానికి వస్తున్నారని తెలిపారు. ఒకవైపు రోగులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. మరోవైపు ఆస్పత్రి సేవలను విస్తరిస్తున్నామని, దీనిలో భాగంగా గచ్చిబౌలిలో 2020 డిసెంబర్‌ నాటికి అత్యాధునిక ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తున్నామని డాక్టర్‌ జీఎస్‌రావు తెలిపారు. త్వరలోనే అత్యాధునిక హంగులు, నిపుణులతో ప్రత్యేక గుండె మార్పిడి చికిత్సల విభాగాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా