మిర్యాలగూడ : అభ్యర్థుల్లో ఉత్కంఠ

10 Dec, 2018 11:46 IST|Sakshi

 లెక్కల్లో మునిగితేలుతున్న నాయకులు

 పెరిగిన పోలింగ్‌పై  అందరి ఆశలు 

సాక్షి, మిర్యాలగూడ : సాధారణ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ముగిసింది. దాంతో ప్రచార ఆర్భాటాలు, ఓటర్లకు గాలం వేయడం ముగిసింది. ఎన్నికల్లో ప్రధాన అంకమైన పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు అంకమైన కౌంటింగ్‌ ఈ నెల 11వ తేదీన ఉంది. ఇంతకాలం పాటు ఎన్నికల ఆర్భాటాల్లో ఉన్న అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. పోటీ చేసిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులంతా రాజకీయ ఉద్దండులే కావడం గమనార్హం. టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసిన భాస్కర్‌రావు గత ఎన్నికల్లో తెలంగాణ వాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ తరుపున విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌. కృష్ణయ్య 40సంవత్సరాలుగా బీసీ ఉద్యమ నేతగా కొనసాగుతున్నారు. సీపీఎం తరుపున పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డి 40సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండటంతో పాటు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ఈ ముగ్గురు కూడా ఈ ఎన్నికల్లో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మండలాల వారీగా ఆయా పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి ఓట్ల శా తాన్ని లెక్కించుకుంటున్నారు. ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయనే విషయంతో పాటు తమకు ఎన్ని ఓట్లు వస్తాయనే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల్లో ఎవరికి వారుగా తమదే విజయం అని పేర్కొంటున్నారు. 
పెరిగిన పోలింగ్‌పై చర్చ..
గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో 79.13 శాతం ఉన్న పోలింగ్‌ ఈ ఎన్నికల్లో 84.57కు పెరిగింది. పెరిగిన పోలింగ్‌ శాతం తమకంటే తమకే అనుకూలంగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మళ్లీ ఆయననే గెలిపించాలని ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తుండగా, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థులంతా ఏకమయ్యారని, అందుకు తమకే అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పెరిగిన పోలింగ్‌ ఎవరికి లాభం చేకూరనుందో మరో రోజు వేచి చూడాల్సిందే. 
స్వతంత్రుల ఓట్లు ఎవరికి గండిపడునో..
గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్నికల్లో 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దాంతో రెండు ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేశారు. రెండు మిషన్లు పక్కపక్కనే పెట్టడం వల్ల కూడా ఓటర్లు కొంతమంది అనుకున్న గుర్తుకు ఓటే వేయలేదని, దాంతో స్వతంత్ర అభ్యర్థులకు అధికంగా ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులకు అనుకున్నట్లుగానే ఎక్కువ ఓట్లు వస్తే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. దాని వల్ల ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములపై కూడా ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.   

మరిన్ని వార్తలు