ఒక్క చుక్కా వదలడం లేదు!

28 Jul, 2017 01:54 IST|Sakshi
ఒక్క చుక్కా వదలడం లేదు!

కృష్ణా నీటిని మొత్తంగా వాడేస్తున్న ఎగువ రాష్ట్రాలు
దిగువన తెలంగాణ, ఏపీ ప్రాజెక్టుల్లోకి రాని జలాలు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉండిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటే... ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మాత్రం నీటిని అడ్డగోలుగా వాడేసుకుంటున్నాయి. ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీటిని వచ్చినట్టు విద్యుదుత్పత్తి, సాగు అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్ర అయితే కోయినా ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేస్తూ.. నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నది. కర్ణాటకకు గత పదిహేను రోజుల్లో 120 టీఎంసీల మేర నీరొచ్చినా చుక్క నీటిని దిగువకు వదలకుండా నిల్వ చేసుకోవడంతోపాటు.. కాల్వల ద్వారా సాగు అవసరాలకు మళ్లిస్తోంది. దీంతో దిగువకు చుక్క నీరు రాక తెలంగాణ, ఏపీలు విలవిల్లాడుతున్నాయి.
ఒక్క చుక్క కూడా వదలడం లేదు
మహారాష్ట్ర పరిధిలో ఉన్న 38 ప్రాజెక్టు (కృష్ణా నదిపై 13, భీమా నదిపై 25)లలో 65 నుంచి 80 శాతం వరకు నీటి నిల్వలున్నాయి. బేసిన్‌ ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న కోయినాలో కొద్దిరోజుల కిందే విద్యుదుత్పత్తి మొదలుపెట్టి.. 50 నుంచి 60 టీఎంసీల నీటిని వాడేసుకున్నారు. విద్యుదుత్పత్తి చేయగా దిగువకు వెళ్లే నీటిలో కొంత సాగు అవసరాలకు మళ్లించగా, మిగతా నీరు వృథాగా అరేబియా సముద్రంలోకి వెళుతోంది. ఇక కర్ణాటక కూడా ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులను నింపుకొంటూ.. అటు విద్యుదుత్పత్తికి, సాగు అవసరాలకు వినియోగిస్తోంది. ఇలా ఎగువ రాష్ట్రాలు తమకున్న నికర జలాల కేటాయింపుల పేరిట వచ్చిన నీటిని వచ్చినట్లు వాడుకోవడంతో దిగువకు చుక్క నీరు చేరలేదు. దీనికితోడు ప్రస్తుతం ఎగువ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం తగ్గడంతో.. దిగువన మన ప్రాజెక్టులకు నీటి రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.

ప్రాజెక్టులన్నీ ఖాళీ
కృష్ణా బేసిన్‌ ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు చేరలేదు. ప్రధానమైన సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం వినియోగార్హమైన నీరు ఒక టీఎంసీ కూడా లేకపోవడం ఆందోళనకరంగా మారింది. ఇక ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం ఇటీవలే శ్రీశైలం నుంచి 2 టీఎంసీలు వదిలితే అందులో సాగర్‌కు చేరింది 1.33 టీఎంసీలే. మిగతా 0.6 టీఎంసీల నీరు ఆవిరిగా నష్టమైంది. ఇప్పుడా నీటి కోసం కూడా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తుతోంది.

>
మరిన్ని వార్తలు