గులాబీ నేతలకు నిరాశే!

28 Jul, 2017 01:46 IST|Sakshi
గులాబీ నేతలకు నిరాశే!
- అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదనే సమాచారంతో ఆందోళన
నేతల సర్దుబాటు కష్టమేనన్న అభిప్రాయాలు
 
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అధికార టీఆర్‌ఎస్‌ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వి భజనను చేపట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తెలియ డంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. పునర్విభజన జరిగితే ఈ సంఖ్య 153కు పెరుగుతుంది. అంటే అదనంగా 34 అసెంబ్లీ స్థానాలు అందుబాటులోకి వచ్చేవి. దానివల్ల పలువురు నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం దక్కేది. కానీ తాజా పరిణామాలు, ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ నుంచి పార్టీ వర్గాలకు అందిన సమాచారం మేరకు అసెంబ్లీ సీట్ల పెంపు ఉండే పరిస్థితి కనిపించడం లేదు.
 
సర్దుబాటు కష్టమే!
మూడేళ్ల కింద జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కని వారు, పోటీ చేసి ఓడిపోయిన వారు.. అసెంబ్లీ సీట్ల పెంపు కచ్చితంగా ఉంటుందన్న అంచ నాలో ఉన్నారు. సీట్లు పెరిగితే ఈసారి తమకు అవకాశం దక్కుతుందని భావించారు. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడి పోయిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే లుగా గెలిచినవారు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అలా వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన వారు ఏకంగా 27 మంది దాకా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు, ఇటు టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జుల (ఓడిపోయిన వారు)కు మధ్య పొసగడం లేదు. ఇక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్న చోట్ల కూడా వేర్వేరు వర్గాలు ఉన్నాయి. ఇక విపక్ష ఎమ్మెల్యేలున్న చోట పార్టీ తరఫున ఓడిపోయిన వారే కాకుండా, అదే స్థాయిలో ఉన్న ఇతర నాయకులూ ఈసారి టికెట్‌ ఆశిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఉన్న 119 స్థానాల్లో ఇంత మందిని సర్దుబాటు చేయడం గులాబీ అధినాయకత్వానికి కష్టంగా మారనుంది.
 
చాలా చోట్ల ఇదే పరిస్థితి
దేవరకొండలో మొదట జెడ్పీ చైర్మన్‌ను (కాంగ్రెస్‌) టీఆర్‌ఎస్‌లోకి తీసుకురాగా, తర్వాత అక్కడి ఎమ్మెల్యే (సీపీఐ) గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఉండనే ఉన్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఇప్పుడు మూడు కుర్చీలాట జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ తుంగతుర్తి నియోజకవర్గంలో కీలకంగా పనిచేసిన మందుల సామేలుకు గత ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. ఇక్కడ గ్యాదరి కిషోర్‌కు టికెట్‌ ఇవ్వగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇక్కడ ఇప్పటికీ ఈ ఇద్దరు నాయకుల మధ్య పోటీ ఉంది. ఇక రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు పొందిన కొందరు ఎమ్మెల్యే టికెట్‌పై ఆశతో ఉన్నారు. నల్లగొండలో బండా నరేందర్‌రెడ్డి, పెద్దపల్లిలో ఈద శంకర్‌రెడ్డి, నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి వంటి వారు ఈ వరసలో ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో మరిన్ని కొత్త ముఖాలను తెరపైకి తెచ్చే యోచనలో గులాబీ అధినాయకత్వం ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే నేతల ఎంపిక ప్రక్రియ క్లిష్టం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
గట్టిగా ప్రయత్నించినా..
తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చాలా సార్లు ఒత్తిడి తెచ్చింది. గతేడాది ఫిబ్రవరిలోనే సీఎం కేసీఆర్, అప్పటి ప్రభుత్వ సీఎస్‌ రాజీవ్‌శర్మలు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 26వ సెక్షన్‌ మేరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కోరారు. ఆ తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ నాయకత్వం పలుమార్లు కేంద్ర హోంశాఖకు, ఆ శాఖ మంత్రికి, ప్రధానికి విజ్ఞప్తులు చేసింది. కానీ సానుకూల స్పందన రాలేదు. 
మరిన్ని వార్తలు