ఎన్నికల జప్తులో ఆల్‌టైమ్‌ రికార్డ్‌! 

6 Dec, 2018 03:13 IST|Sakshi

రూ.129.46 కోట్ల నగదు పట్టివేత

రూ.10.87 కోట్ల విలువైన మద్యం జప్తు

గత ఎన్నికల రికార్డులు కనుమరుగు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన నగదు, మద్యం ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టిస్తోంది. పోలింగ్‌కు కేవలం 48 గంటలు మిగిలి ఉండగా, పట్టుబడిన నగదు, మద్యం, బహుమతుల పేరిట పంపిణీ చేయడానికి ఉద్దేశించిన వస్తువుల విలువ రూ.129.46 కోట్లకు చేరుకుంది. పోలీస్, ఆదాయపు పన్ను, ఎక్సైజ్‌ అధికారుల నిఘా పటిష్టంగా ఉండడంతో వారి కన్నుగప్పడం ఉల్లంఘనులకు కష్టమవుతున్నదని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకు పట్టుబడిన నగదు రూ.109.67 కోట్లకు చేరుకోగా, రూ.10.87 కోట్ల విలువచేసే 5.13 లక్షల లీటర్ల మద్యాన్ని పోలీసు, ఇతర నిఘా బృందాలు జప్తు చేశాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల కింద ఇప్పటివరకు 275 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే, అత్యధికంగా రూ.8.92 కోట్ల విలువ చేసే బంగారు, వెండి, గంజాయి, గుట్కా, పొగాకు వంటివి రవాణా సందర్భంగా కానీ, భద్రపరచిన ప్రదేశాల నుంచీ కానీ జప్తు చేశారు.

వీటిలో అభ్యర్థులు లేదా పార్టీలు పంచడానికి తీసుకెళ్తున్న రూ.1.63 లక్షల విలువ చేసే 1.18 కిలోల వెండి, 39.8 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. అభ్యర్థులను ప్రలోభపెట్టేవాటిలో నగదు, మద్యం ప్రధాన పాత్ర పోషిస్తున్నందున వాటి కదలికలే ఎక్కువగా నమోదవుతున్నాయి. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అంతరాయం కలిగించే అవకాశముందన్న కారణంతో అనుమానితులందరినీ చట్ట ప్రకారం ముందుగానే అధీనంలోకి తీసుకోవడం జరిగిందనీ, ఎన్నడూ లేనంతగా నాన్‌–బెయిలబుల్‌ వారంట్లు జారీచేయడం జరిగిందనీ, ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి 2,204 చోట్ల నాకాబందీ, చెక్‌పోస్ట్‌లు, నిఘా పెంచడం వంటి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 17,779 సెక్యూరిటీ కేసులను నమోదు చేయగా 96,561 మందిని బైండోవర్‌ చేయడం, 8,688 ఆయుధాలను డిపాజిట్‌ చేసుకోవడం, 18 ఆయుధాల లైసెన్సుల రద్దు, 1,042 ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కేసుల నమోదు, 11,806 నాన్‌ బెయిలబుల్‌ వారంట్లను జారీ చేయడం జరిగిందని తెలిపారు. గోడలు పాడుచేయడంవంటి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 2,77,775 కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని రజత్‌కుమార్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు