ఏపీలో తెలంగాణ ఎంసెట్ కేంద్రాల ఏర్పాటు అసాధ్యం!

8 Apr, 2015 05:08 IST|Sakshi
  • ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ కేంద్రాల్లో రాయాల్సిందే
  • ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
  •  సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ కేంద్రాలను ఏపీలో ఏర్పాటు చేయడం కుదరదని, అక్కడి విద్యార్థులు కూడా తెలంగాణకే వచ్చి ఎంసెట్ రాయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఏపీలోనూ తెలంగాణ ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ఇటీవల తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్యకు లేఖ రాశారు. దీనిపై రంజీవ్ ఆర్.ఆచార్య, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు మంగళవారం సమావేశమై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రాల ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
     
    ఈనెల 9తో ఎంసెట్ దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో కొత్త కేంద్రాల ఏర్పాటు అసాధ్యమని తేల్చారు. ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణ ఎంసెట్ రాయొచ్చని, అయితే వారు తెలంగాణలోని కేంద్రాల్లోనే ఎంసెట్ రాయాలని అందులో పేర్కొంది. ఏపీ విద్యార్థుల వెసులుబాటు కోసమే ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలోని కోదాడలో ఈసారి కొత్తగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

    నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుంచి కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడని ఏపీ ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియ ముగియనున్న సమయంలో రెండు రోజుల కిందటే ఏపీలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాట్లన్నీ పూర్తికావచ్చాయని, ఇప్పుడు ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ అదనంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటు అసాధ్యమని అధికారులు తేల్చారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఒకటి రెండ్రోజుల్లో ఏపీ విద్యా శాఖకు లేఖ రాసేందుకు తెలంగాణ విద్యా శాఖ నిర్ణయించింది. మరోవైపు ఎవరి కౌన్సెలింగ్ వారే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలంగాణలో ఏపీ ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు మాత్రం అధికారులు ఒప్పుకొన్నారు.

>
మరిన్ని వార్తలు