‘బయోమెట్రిక్‌’పై స్పష్టత కరువు

10 Jul, 2017 01:46 IST|Sakshi
‘బయోమెట్రిక్‌’పై స్పష్టత కరువు

కళాశాలల్లో సాధారణ పద్ధతిలోనే అటెండెన్స్‌
సాక్షి, హైదరాబాద్‌: కళాశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానంపై స్పష్టత కరువైంది. ఈ హాజరు ఆధారంగానే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. విద్యార్థులతోపాటు బోధకుల హాజరులోనూ సమయపాలన, పారదర్శకత కోసం బయోమెట్రిక్‌ విధానాన్ని తీసుకురావాలని భావించింది.

ఈ మేరకు బయోమెట్రిక్‌ మెషిన్లు కళాశాలల్లో అందుబాటులో పెట్టాలని యాజమాన్యాలకు సూచించింది. అయితే, స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సాధారణ పద్ధతిలోనే హాజరును స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తయింది. ఇంజనీరింగ్, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.

మెషిన్ల కొనుగోలుకు వెనుకాడుతున్న యాజమాన్యాలు
రాష్ట్రంలో 7,005 కాలేజీలున్నాయి. వీటిలో 2,750 ఇంటర్మీడియట్, వొకేషనల్, 4,245 డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, వృత్తి విద్యా కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 16.50 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇంత పెద్ద సంఖ్యలోని విద్యార్థుల హాజరు నమోదు చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కనిష్టంగా 30 వేల మెషిన్లు అవసరమవుతాయని అంచనా.

అయితే, మెషిన్లు కొనుగోలు చేసి నిర్వహించడం కష్టమని, వీటిని ప్రభుత్వమే సరఫరా చేయాలని కాలేజీ యాజమాన్య సంఘాలు కోరుతున్నాయి. కళాశాలల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తే దానికి విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈపాస్‌ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ భావించింది. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసే అంశంపై సాంకేతిక విభాగంతో చర్చించింది. అయితే, బయోమెట్రిక్‌ విధానంపై స్పష్టత రాకపోవడంతో ఆ శాఖ సైతం నిర్ణయాన్ని మార్చుకుంది. ఎప్పటిలాగే విద్యార్థుల నుంచి ఒన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) పద్ధతిని పాటించాలని అంచనాకు వచ్చింది.

మరిన్ని వార్తలు