సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్‌ సిద్ధమా?.. రేవంత్‌ సవాల్‌

10 Nov, 2023 18:33 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుపై సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్‌ సిద్ధమా?.. విచారణకు నేను సిద్ధం.. సవాల్‌ విసురుతున్నా.. లేకపోతే కామారెడ్డిలో ముక్కు నేలకు రాయాలి’’ అంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన కామారెడ్డిలో కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ బహిరంగ సభలో మాట్లాడుతూ, కామారెడ్డి బంగారు తునక అంటున్నారు.. గజ్వేల్ నుంచి ఎందుకు వస్తున్నారు. అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మకు బంగారు గాజులు అంటే నమ్మడానికి కామారెడ్డి ప్రజలు అమాయకులు కాదు’’ అంటూ రేవంత్‌ ఎద్దేవా చేశారు.

‘‘కుట్రతో కామారెడ్డి భూముల కోసం ఇక్కడికి వస్తున్నారు కేసీఆర్‌. మాస్టర్ ప్లాన్ రద్దు అంటున్నారు.. మీ ప్రభుత్వమే రద్దు అయ్యింది. మీ కుటుంబం కోసమేనా 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది. కేసీఆర్‌ను ఓడించేందుకే, పార్టీ ఆదేశం మేరకే కామారెడ్డికి వచ్చాను. బూచోడు వస్తున్నాడు. మీ భూములు లాక్కుంటారు.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కనిపించడు.. వినిపించడు.. కామారెడ్డి నియోజక వర్గంలో 3 లక్షల 60 వేల ఎకరాలకు వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ద్వారా గోదావరి జలాలు అందాలంటే కాంగ్రెస్ గెలవాలి’’  అని  రేవంత్‌ పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌ బీజేపీ కుట్రే: కేటీఆర్‌  

మరిన్ని వార్తలు