ఎన్నికల బరిలో ఆటోవాలా

12 Nov, 2018 10:50 IST|Sakshi

రెండున్నర దశాబ్దాలుగా పోటీ చేస్తున్న ఆర్ల సత్తిరెడ్డి  

ఆటో డ్రైవర్ల సంక్షేమంపై పార్టీలనుకదిలించడమే లక్ష్యం

సికింద్రాబాద్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  

ఎల్లుండి దాఖలు చేయనున్న నామినేషన్‌  

సాక్షి, సిటీబ్యూరో: ఆయన ఓ సాధారణ ఆటోవాలా. ఆటో కార్మికుల అస్తిత్వానికి ప్రతీక. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెండున్నర దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనే సీతాఫల్‌మండికి చెందిన ఆర్ల సత్తిరెడ్డి. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రతి ఎన్నికలోనూ వందల్లో ఓట్లు  కైవసం చేసుకొని ప్రధాన పార్టీలకు సైతం దడ పుట్టిస్తున్నారు. 1994 నుంచి వరుసగా  ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న సత్తిరెడ్డి  ‘ఆటో డ్రైవర్ల సంక్షేమమే తన ప్రధాన ఎజెండా అని ఘంటాపథంగా చెబుతున్నారు. రెండురోజుల్లో నామినేషన్‌ దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు ఆయన. ఆటోడ్రైవర్ల  సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసిన సత్తిరెడ్డి.. ఆ సంఘానికి  ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.  

ఎన్నికల్లో పోటీ ఎందుకంటే..  
ఆటో కార్మికుల సమస్యలపై రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదు. మొక్కుబడిగా ఏవో కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. కానీ  ఆటోడ్రైవర్ల  సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. నగరంలో ఫైనాన్షియర్ల వేధింపుల కారణంగా  ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి వీధిన పడ్డాయి. మరెంతోమంది డ్రైవర్లు వృత్తిని  వదిలేసుకొని అడ్డా కూలీలుగా మారారు. ఆటో రిక్షా కొనుక్కొని ఉపాధి పొందాలనుకొనే నిరుద్యోగికి ప్రభుత్వమే సొంతంగా రుణ సదుపాయం కల్పిస్తే  ఈ బాధలు ఉండవు కదా. కార్మిక సంఘాలుగా  అనేకసార్లు ప్రభుత్వంతో పోరాడుతున్నప్పటికీ ఫైనాన్షియర్‌ల వేధింపుల నుంచి విముక్తి  లభించడం లేదు. ఇలాంటి అనేక సమస్యలను విస్తృతంగా  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే  ఎన్నికలను ఒక  ప్రచార అస్త్రంగా మలుచుకొన్నాం’ అని చెబుతారాయన. ప్రజలు, ఆటో కార్మికుల మద్దతుతో ఎప్పటికైనా గెలిచితీరుతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సత్తిరెడ్డి. 

మరిన్ని వార్తలు