లాక్‌డౌన్‌ వేళ.. నాయీబ్రాహ్మణుల విలవిల

24 Apr, 2020 09:36 IST|Sakshi

ఉపాధి కోల్పోయిన వేలాదిమంది నాయీలు

నెల రోజులుగా మూతపడిన సెలూన్లు, బ్యూటీపార్లర్లు

ప్రభుత్వం ఆదుకోవాలంటున్న సంక్షేమ సంఘాలు  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు, బ్యూటీపార్లర్లు విలవిలలాడుతున్నాయి. వేలాది మంది నాయీబ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఏ రోజుకు ఆ రోజు సెలూన్‌ తెరిస్తే తప్ప ఆదాయం లభించని నాయీబ్రాహ్మణుల ఉపాధిపైన లాక్‌డౌన్‌ దారుణంగా వేటు వేసింది. 90 శాతం మందికి ఇల్లు గడవడం కష్టంగా మారింది. సొంతంగా సెలూన్లు నిర్వహిస్తున్న వాళ్లకు వాటి అద్దెలు, ఇంటి కిరాయిలు, విద్యుత్‌ బిల్లులు తదితర ఖర్చులు మరింత భారంగా మారాయి. లాక్‌డౌన్‌ విధించి నెల రోజులైంది. దీంతో ఇప్పటికే ఎంతోమంది నాయీబ్రాహ్మణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ వృత్తిలో కొనసాగడం సాధ్యం కాబోదని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సెలూన్లు, బ్యూటీపార్లర్లతో పాటు సన్నాయి వాయిద్యాలపైన కూడా లాక్‌డౌన్‌ వేటు పడింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, వేడుకల్లో సన్నాయి వాయించే వారు సైతం ఉపాధిని కోల్పోయారు.  

ఉన్నత చదువులు చదివినా...
హెయిర్‌ కటింగ్, హెయిర్‌ రీ ట్రీట్‌మెంట్, ఫేషియల్, బ్రైడల్‌ మేకప్, మెనిక్యూర్, పెడిక్యూర్‌ వంటి సేవలతో బ్యూటీపార్లర్లు, హెయిర్‌కటింగ్‌ సెలూన్లు ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. బీటెక్, ఎంటెక్‌ వంటి ఉన్నత చదువులు చదివినప్పటికీ ఎలాంటి ఉద్యోగాలు లభించక చాలామంది సెలూన్లలో పని చేస్తున్నారు. నగరంలో చిన్నచిన్న ఇళ్లు అద్దెకు తీసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ‘లాక్‌డౌన్‌ కారణంగా ఇంటినుంచి బయటకు వెళ్లలేకపోతున్నాం. ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా అయిపోయాయి. షాపు తెరిస్తే తప్ప సరుకులు తెచ్చుకొనేందుకు అవకాశం లేదు’ అని బోడుప్పల్‌కు చెందిన సతీష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 17,500కు పైగా కటింగ్‌ షాప్స్‌తో 50 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. కనీసం 2 లక్షల మంది వీరిపైన ఆధారపడి ఉన్నారు. మరోవైపు తెలంగాణ అంతటా 10 లక్షల మంది కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు. 

అప్పుల భారంతో కుదేల్‌...
మరోవైపు చాలామంది నాయీబ్రాహ్మణులు ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకుల నుంచి రూ.లక్షల్లో రుణాలు తీసుకొని షాపులు ఏర్పాటు చేసుకున్నారు. డెయిలీ ఫైనాన్స్‌పైన ఆధారపడి షాపులు నడుపుతున్న వాళ్లు ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షాçపులు  మూసివేయడంతో రుణాలు భారంగా మారాయని, వడ్డీలు పెరిగాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ‘అప్పుల భారం వల్ల  షాపులను శాశ్వతంగా మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది’ అని సికింద్రాబాద్‌కు చెందిన వెంకటేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

మూగవోయిన ‘సన్నాయి’
లాక్‌డౌన్‌ కారణంగా దేవాలయాలు మూత పడ్డాయి. పలుచోట్ల కల్యాణకట్టలో పనిచేస్తున్న 1500 మంది నాయీ బ్రాహ్మణులకు పనులు లేవు. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేయడం వల్ల సన్నాయి వాయిద్య కళాకారులకు పని లేకుండా పోయింది. ఈ వృత్తిపైన ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి
లాక్‌డౌన్‌ కారణంగా 90 శాతానికి పైగా నాయీబ్రాహ్మణులు ఉపాధిని కోల్పోయారు. షాపులు, ఇంటి అద్దెలు, విద్యుత్‌ బిల్లులు, వీటికి తోడు రుణాలు, వాటిపైన వడ్డీలు తీవ్ర భారంగా మారాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. అత్యవసర పరిస్థితుల కింద రాష్ట్ర ప్రభుత్వం హెయిర్‌ కట్టింగ్‌ షాపులు ఉన్న ప్రతి ఒక్కరికీ, వాయిద్య కళాకారులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలి. – రాచమల్ల బాలకృష్ణ, అధ్యక్షుడు, తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవాసంఘం

ఆర్థిక సాయం చేయాలి
సెలూన్లు, బ్యూటీపార్లర్లకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి. పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేయాలి. అలాగే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాస్క్‌లు, గ్లౌస్లు, ప్రత్యేక కిట్లు అందజేసి ఈ వృతిని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటే మంచిది.  – మామిడాల శ్రీనివాస్, వోగ్‌ బ్యూటీపార్లర్, ఆర్టీసీ కాలనీ

సన్నాయి వాయిద్యాన్ని కాపాడండి
బ్యాండుమేళాలు, డీజేల్లాంటివి ఎన్ని ఉన్నప్పటికీ పెళ్లిళ్లు, శుభకార్యాల్లో సన్నాయి తప్పనిసరి. అలాంటి శుభప్రదమైన వాద్యం ఇప్పుడు మూగవోయింది. ప్రభుత్వం స్పందించాలి.       – నర్సింహులు

మరిన్ని వార్తలు