చీరలెలా ఉన్నాయ్‌..

7 Sep, 2018 15:34 IST|Sakshi
భీమ్‌గల్‌లో చీరలను పరిశీలిస్తున్న మహిళలు, బతుకమ్మ శాంపిల్‌ చీరలు

భీమ్‌గల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పథకం అభాసుపాలు కాకుండా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఏడాది ఈ చీరల పంపిణీ వివాదాస్పదమైంది. నాణ్యత కొరవడిన చీరలను పంపిణీ చేసారని, చౌకబారు చీరలతో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఆరోపణలు వచ్చాయి. సోషల్‌ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల చీరలను తగుల బెట్టడం, ప్రతిపక్షాలు వీటిపై విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఏడు ఎటువంటి ఆరోపణలు రాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు అవకాశమివ్వకూడదని జాగ్రత్తగా పథక నిర్వహణ చేపట్టనుంది. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తం గా అన్ని మండలాలలో బతుకమ్మ చీరలను ఐదు రోజుల పాటు ప్రదర్శనకు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌

జిల్లాలో అన్ని మండలాలలో చీరలపై మహిళల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రతి మండలంలో ఐదు చోట్ల వీటిని ఉంచి తద్వారా వాటిపై మహిళల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకుగాను ప్రతి చోట ఒక రిజిస్టర్‌ను ఏర్పాటు చేసారు. చీరలను పరిశీలించిన వారు అభిప్రాయాలను, పేరు, ఫోన్‌ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి చీరల ప్రదర్శన నిర్వహించి అభిప్రాయచాలు కోరతున్నారు. ఇందు కోసం ఈ నెల 5 నుంచి 10 వరకు గడువు నిర్ణయించింది. 10వ తేదీ అనంతరం మండలాలవారీగా మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై రాండమ్‌గా ఫీడ్‌బ్యాక్‌ను పైఅధికారులకు పంపిస్తారు. దీని ఆధారంగా చీరల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది.

18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు  
రేషన్‌ కార్డులో పేరుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఇవి కేవలం మహిళల అభిప్రాయం కోసం తీసుకువచ్చిన శాంపిల్‌ చీరలు మాత్రమే. ఇంకా బతుకమ్మ చీరలు రాలేదు. గత సంవత్సరం జిల్లాకు 5 లక్షల 13 వేల 739 చీరలు వచ్చాయి. అందులో 46 వేల చీరలు మిగలగా వాటిని తిరిగి పంపించాం. ఈ సంవత్సరం మరో రెండు శాతం పెరిగి ఉండచ్చు.    – శ్రీనివాస్‌ డీపీఎం, ఐకేపీ

కానుకలకు వెల కట్టవద్దు
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ కానుకగా ఈ చీరలను అందిస్తోంది. ఇది ఆడపడుచుకు పుట్టింటి వారు ఇచ్చే కానుకగా భావించాలి. దీనికి వెల కట్టడం మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుంది. ప్రతి పక్షాలు ప్రతీది రాజకీయం చేసి ప్రజల్లో దిగజారిపోయాయి. ఈ బతుకమ్మ కానుకలు ఎంపీ కవితమ్మ కలల ప్రాజెక్టు. సగటు మహిళల ఆలోచనలకు ఆమె ప్రతిరూపం.
– వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే, బాల్కొండ

మరిన్ని వార్తలు