24 గంటల్లో భరత్‌రెడ్డిని అరెస్టు చేయాలి

10 Dec, 2017 03:07 IST|Sakshi
నిలదీస్తున్న విద్యార్థులను వారిస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు రాములు

లేకపోతే కలెక్టర్, పోలీసు కమిషనర్‌లను బదిలీ చేస్తా 

జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు రాములు 

నిందితుడికి ఎంపీ కవిత ఆశ్రయం  

అభంగపట్నంలో బాధిత దళితులను పరామర్శ 

నవీపేట(బోధన్‌): నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నం దళిత యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్‌లను కిడ్నాప్‌ చేసి, చిత్ర హింసలకు గురి చేసిన నిందితుడు భరత్‌రెడ్డిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్‌లను బదిలీ చేస్తానని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు హెచ్చరించారు. గ్రామంలోని దళిత బాధితులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దళితుల పట్ల క్రూరంగా వ్యవహరించిన భరత్‌రెడ్డి తీరును గత నెల 11న వీడియోలో చూడగానే స్థానిక సీపీ, ఏసీపీలను అప్రమత్తం చేసి, భరత్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించానన్నారు. కానీ, పోలీసులు ఇంత వరకు అరెస్టు చేయలేదన్నారు.

నిందితుడికి సహకరిస్తున్న వారందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నిందితుడికి ఎంపీ కవిత ఆశ్రయం కల్పించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందుకే పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆయన ఆరోపించారు.  ఆయన వెంట కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, సీపీ కార్తికేయ ఉన్నారు. రాములు రాక కోసం దళిత సంఘాలు, కాకతీయ, ఉస్మానియా, శాతవాహన వర్సిటీలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు గంటల తరబడి నిరీక్షించారు. లక్ష్మణ్, రాజేశ్వర్‌ను పరామర్శించి బయటకు వస్తుండగా పలు సంఘాల నాయకులు కమిషన్‌ సభ్యుడు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.  

మరిన్ని వార్తలు