మూడేళ్లలో ముగ్గురు

18 Apr, 2015 03:06 IST|Sakshi

నిజాంసాగర్ : ప్రభుత్వ ఉద్యోగులు సేవే పరమావధిగా బావించాల్సింది పోయి లంచాల కోసం అమాయకులను పీడిస్తూ కటకటాల పాలవుతున్నారు. ఒక జుక్కల్ నియోజకవర్గంలోనే మూడేళ్లలో ముగ్గురు ఉద్యోగులు ఎసీబీ చిక్కడంతో అవినితీ ఏ మేరకు జరుగుతుందో తెలుస్తోందని పలువురు అంటున్నారు. లంచావతారుల ఆట కట్టించడానికి ఎసీబీ అధికారులు దాడులు చేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పనితీరు మార్చుకోకపోవడంతో బోను ఎక్కాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి.

వరుసగా మూడేళ్ల కాలంలో ఎసీబీ అధికారులు దాడులు చేసి ముగ్గురు లంచవతారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుం ద, జుక్కల్ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగు లు లంచావతారులుగా మారుతున్నారు. 2013 అక్టోబర్‌లో మద్నూర్ మండలంలోని సలాబత్‌పూర్ చెక్ పోస్టుపై ఎసీబీ అధికారులు దాడి చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు రూ. 18,177 అక్రమ డబ్బుతో ఎసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.  

2014 సెప్టెంబర్‌లో సలాబత్‌పూర్ చెక్‌పోస్టుపై ఎసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏఎంవీఐ వీరస్వామి 34,100 రుపాయలతో రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం బిచ్కుంద మండల ట్రాన్స్‌కో ఎఈ ప్రేమ్‌కుమార్ రూ. 8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయూరు.  
 
కళ్లు తెరవని అధికారులు...
మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. అధికారుల పనితీరుపై పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఉద్యోగులు లంచానికి అలవాటుపడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులపై దృష్టి సారించి అక్రమాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు