మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి వానలు

22 Nov, 2023 05:16 IST|Sakshi

పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి 

దీని ప్రభావంతో రాష్ట్రంలో మరింత తగ్గనున్న కనిష్ట ఉష్ణోగ్రతలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న మూడురోజులు పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్‌ తీరం నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపించి ఉన్నట్లు పేర్కొంది.

దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యాయి. ప్రస్తుతం సాధారణస్థితిలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న మూడురోజులు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 32 డిగ్రీ సెల్సీయస్‌ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 

మరిన్ని వార్తలు