యువకుడి దారుణ హత్య

24 May, 2016 02:35 IST|Sakshi
యువకుడి దారుణ హత్య

జనం చూస్తుండగానే వేట కొడవళ్లతో దాడి
ప్రాణం తీసిన ‘రియల్’ గొడవలు
కొత్త ఎస్పీ బాధ్యతలు చేపట్టినరోజే జిల్లాకేంద్రంలో సంచలనం

 
సమయం సాయంత్రం 7:30 గంటలు.. జిల్లాకేంద్రం నడిబొడ్డున.. రద్దీగా ఉండే జిల్లా ఆస్పత్రి ప్రాంతం.. ఆస్పత్రికి వచ్చిన వారు ఇళ్లకు వెళ్తున్నారు. ఎప్పటిలాగే ఆటోలు, ఇతర వాహనాల రద్దీ ఉంది. ముసుగులు ధరించిన కొందరు ఓ యువకుడిని అనుసరిస్తున్నారు. ఇంతలో రోడ్డుపై ఆగిన అతడిపై వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు.

ప్రతిఘటించే క్రమంలో ప్రాణాలువిడిచాడు. జనం ఈ తంతును చూస్తూ హతాశులయ్యారు. ఫ్యాక్షన్ సినిమా సీన్‌ను తలపించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కొత్త ఎస్పీ బాధ్యతలు చేపట్టిన రోజునే జరిగిన ఈ ఘటన పోలీసులకు సవాల్ విసిరింది..! - మహబూబ్ నగర్ క్రైం

 
 
జిల్లాకేంద్రంలో ఓ యువకుడిని కొందరు దుండగులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోయిల్‌కొండ మండల కేశావపూర్ పంచాయతీ రాజునాయక్ తండాకు చెందిన బిస్లావత్ విజయ్(35) కొద్దిరోజులుగా జిల్లా కేంద్రంలోని మర్లు ప్రాంతంలో అద్దెకు నివాసం ఉంటూ పట్టణంలోనే ఫైనాన్స్, చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడు. ఇదిలాఉండగా, సోమవారం సాయంత్రం స్నేహితుడితో కలిసి బైక్‌పై బజారుకు వచ్చాడు. స్నేహితుడిని న్యూటౌన్‌లో దించేసి అతడు స్థానిక జిల్లా ఆస్పత్రి ఎదుట రోడ్డుపై నిల్చున్నాడు.

ముందే మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేయడంతో విజయ్ అక్కడిక్కడే రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలొదిలాడు.. ఆ ప్రాంతమంతా రక్తపుమడుగులా మారింది. సమీపంలోనే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సంఘటన పట్టుకునేందుకు ప్రయత్నించగా దుండుగులు పరారయ్యారు. మృతుడి భార్య, అన్న, తల్లి అక్కడికి చేరుకుని బోరున విలపించారు.
 
పోలీసులకు సవాల్‌గా..  
జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి ఎదుట యువకుడు దారుణహత్యకు గురికావడం సంచలనంగా మారింది. కొత్త ఎస్పీగా రెమా రాజేశ్వరి బాధ్యతలు చేపట్టినరోజునే ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. హత్యస్థలిలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వాహనాలను పోలీసులు దారిమళ్లించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ సోమ్‌నారాయణ సింగ్ సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. ఇదిలాఉండగా, మృతుడు విజయ్ ఫైనాన్స్, రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో భాగస్తుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్దూర్ మండల కేంద్రంలో చేసిన రియల్ వెంచర్ల వద్ద గొడవ తీవ్రస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు