ముంపుపై నేడు మహారాష్ట్రతో చర్చలు

22 Dec, 2015 02:00 IST|Sakshi

తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ
నిర్మాణంపై సంప్రదింపులు
నేడు నాగ్‌పూర్‌కు హరీశ్‌రావు


హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం కీలక  చర్చలు జరపనుంది. ఈ ప్రాజెక్టులో మార్పులతో మహారాష్ట్రలో ముంపు బాగా తగ్గిపోతున్న దృష్ట్యా వాటి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేయనుంది. ఈ మేర కు మంత్రి హరీశ్‌రావు. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, సీఈ హరిరామ్, ఓఎస్డీ శ్రీధర్ దే శ్‌పాండే తదితరుల బృందం మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లి.. అక్కడ ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్‌తో భేటీ కానుంది.

తొలి నుంచి ‘ముంపు’ సమస్య..
 ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తొలుత రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించాలన్న నిర్ణయాన్ని మహారాష్ట్ర వ్యతిరేకించింది. తమ భూభాగంలోని ముంపును అంగీకరించబోమని ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్‌తో చర్చల సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాలు 152 మీటర్ల ఎత్తు నుంచి 148 మీటర్ల వరకు వివిధ స్థాయి లో మహారాష్ట్రలో ఉండే ముంపు ప్రాంతంపై సంయుక్త సర్వే చేశాయి. 152 మీటర్ల వద్ద 7,460 ఎకరాలు, 151 మీటర్ల వద్ద 6,105.69 ఎకరాలు, 150 మీటర్ల వద్ద 4,944.038 ఎకరాల మేర ముంపు ఉంటుందని గుర్తించారు. చివరికి 148 మీటర్ల ఎత్తుపై అధికారుల స్థాయి చర్చల్లో అంగీకారం కుదిరింది. దీంతోనూ మహారాష్ట్రలో కొంతమేర ముంపు ఉండనున్న దృష్ట్యా.. దీనికి మహారాష్ట్ర అంగీకారం తెలపాల్సి ఉంది.

మేడిగడ్డతోనూ..
తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే 40 నుంచి 45 టీఎంసీలకు మించి నీటిని తరలించే అవకాశం లేకపోవడంతో... ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసింది. సుమారు 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉండే మేడిగడ్డ వద్ద నుంచి నీటిని తరలించాలని నిర్ణయించిం ది. మేడిగడ్డ నుంచి గోదావరి పరీవాహకాన్ని ఉపయోగించుకుంటూ మధ్యలో 2 బ్యారేజీలు నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజీతోనూ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కొంతమేర ముంపు ఉంటుంది. దీనిని 103 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో 1,331 హెక్టార్లు, 102 మీటర్లలో అయితే 955, 101 మీటర్లతో 626, 100 మీటర్లతో 356, 99 మీటర్లతో 196, 98 మీటర్లతో 77, 97 మీటర్ల ఎత్తుతో 59 హెక్టార్ల మేర ముంపు ఉంటుందని గుర్తించారు. అయితే 100 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని సర్కారు భావిస్తోంది. దీంతో ముంపుపై మహారాష్ట్ర అంగీకారం కోరే అవకాశాలున్నాయి. దానికి అంగీకరించకపోతే 99 మీటర్ల ఎత్తుకు అయినా ఒప్పించాలని.. ఈ ఎత్తులో ముంపు నదీ గర్భంలోనే ఉంటుందని స్పష్టం చేయనున్నారు. మంత్రుల చర్చల్లో వచ్చే ఫలితం మేరకు త్వరలోనే సీఎం స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందాలు చేసుకోనున్నారు.
 
 

మరిన్ని వార్తలు