జనగామ: ఓటర్లకు కళాకారులతో చైతన్యం

30 Nov, 2018 10:20 IST|Sakshi
ఓటు హక్కు వినియోగంపై స్టేషన్‌ఘన్‌పూర్‌లో అవగాహన కల్పిస్తున్న కళాకారులు

సాక్షి, జనగామ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం), ఓటరు వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌) వినియోగంపై అధికారులు ఓటర్లకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మారిన ఓటింగ్‌ విధానంపై  చైతన్యం చేస్తున్నారు. ఎవరికి ఓటేసినా ఒక్కరికే పడుతుందనే అపోహ తొలగించడంతో పాటు ఎవరికి ఓటేశామనే అంశాన్ని నిర్ధారించుకునే విధంగా ప్రింట్‌ కాపీని సైతం తీసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఓటర్లకు కల్పించింది. తాజాగా అమలులోకి వచ్చిన ఓటింగ్‌ విధానాన్ని ఓటర్లకు తెలియపర్చడం కోసం విస్త్రత ప్రచార కార్యక్రమాలకు జిల్లా ఎన్నికల అధికారులు శ్రీకారం చుట్టారు.

జిల్లాకేంద్రం నుంచి బూత్‌లెవల్‌ వరకు..
నూతన ఓటింగ్‌ పద్ధతులపై జిల్లానుంచి గ్రామీణ ప్రాంతంలోని బూత్‌లెవల్‌ వరకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలుశాఖల అధికారులతో పాటు దివ్యాంగులకు, మహిళ సంఘాలకు, వివిధ వర్గాల ఓటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాలు, పంచాయతీలు, బూత్‌లెవల్‌ వరకు ఓటేసే విధానం, ఓటు వినియోగంపై సవివరంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో కొత్త విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కళాకారులతో ప్రచారం..
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో ఓటు హక్కు వినియోగంపై చైతన్యవంతం చేస్తున్నారు. గణేష్‌ నేతృత్వంలోని సంజీవ, శంకర్, చిరంజీవి, కనుకరాజు, సోమయ్య బృందం జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల పరిధిలో కళాకారులు నూతన ఓటింగ్‌ విధానం, సందేహాలు, అనుమానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జనగామ మునిసిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాల్లో గ్రామాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డమ్మీ ఈవీఎం, వీవీప్యాట్‌లను ఏర్పాటుచేసి ఓటు వేయించి చూపిస్తున్నారు.  ఇటు కళాకారులతో పాటు మరోవైపు ఓటింగ్‌ విధానం తెలియచేస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ముఖ్యకూడళ్ల వద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నాటికి మూడు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళాకారుల అవగాహన కార్యక్రమాలకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్‌లోకి ఓటరు ఎలా వెళ్లాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై చైతన్యవంతం చేస్తున్నారు.

సుద్దాల అశోక్‌తేజతో ఓటు విలువపై అవగాహన..
ఓటుహక్కు వినియోగంపై ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని కోరుతూ అశోక్‌తేజతో ప్రచారం చేయిస్తున్నారు. విలువైన ఓటును దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నారు. ఓటింగ్‌ శాతం పెరిగేలా ఓటు వినియోగంపై ప్రచారం సాగిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు