ఆన్‌లైన్‌ ఈ ‘లైన్‌’లో

15 Jul, 2020 01:44 IST|Sakshi

1 నుంచి 8 తరగతులకు రోజుకు రెండు క్లాసులే..

ఒక్కో సెషన్‌ 30 – 45 నిమిషాలే.. అంతకుమించటానికి వీల్లేదు

9 నుంచి 12 తరగతులకు గరిష్టంగా 4 సెషన్లలోనే బోధన

ప్రీ ప్రైమరీకి రోజుకు అరగంట చాలు

రాష్ట్రాలకు మార్గదర్శకాలను మార్చుకొనే వెసులుబాటు

సాక్షి, హైదరాబాద్ : ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన రెండు సెషన్‌లు చాలని, ప్రీప్రైమరీ తరగతులకు రోజుకు అరగంట బోధన సరిపోతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. కోవిడ్‌–19 ఆంక్షల నేపథ్యంలో పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి రోజులో నిర్వహించే సెషన్స్‌ సంఖ్య, వ్యవధి పరిమితంగా ఉండాలని కోరింది. పాఠశాలల యాజమాన్యాలు రెగ్యులర్‌ తరగతుల మాదిరిగానే ఆన్‌లైన్‌ బోధన చేపడుతున్నాయనీ, దీనివల్ల తమ పిల్లలు గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చోవాల్సి వస్తోందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

దీనిపై స్పందించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్చార్డీ) మంగళవారం ‘ప్రజ్ఞత’ పేరుతో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రీప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతి వ్యవధి రోజులో 30 నిమిషాలకు మించరాదు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు 45 నిమిషాల చొప్పున రెండు ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఉంటే సరిపోతుంది. 9 నుంచి 12వ తరగతుల వారికైతే 30 నుంచి 45 నిమిషాల చొప్పున నాలుగు సెషన్లలో బోధన జరపవచ్చు. ‘కోవిడ్‌–19 మహమ్మారితో పాఠశాలల మూసివేత ప్రభావం దేశంలోని సుమారు 24 కోట్ల మంది చిన్నారుల విద్యపై పడింది. ఇది ఇలాగే కొనసాగితే

వారి చదువులకు తీవ్రనష్టం కలుగుతుంది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు ఆన్‌లైన్‌ ద్వారా నాణ్యమైన విద్య అందించాల్సి ఉంది’అని హెచ్చార్డీ శాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి సలహాలు తీసుకొని ఎన్సీఈఆర్డీ రూపొందించిన ఈ మార్గదర్శకాలు కేవలం సలహాపూర్వకమేనని, స్థానిక అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని మార్చుకోవచ్చని హెచ్‌ఆర్డీ తెలిపింది.

అనుసరించాల్సిన మార్గదర్శకాలివే.....
– డిజిటల్‌ బోధనకు సంబంధించి ప్రిన్సిపాళ్లు ముందుగా విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు, ఇతరత్రా సాంకేతిక పరికరాల సదుపాయాలపై అనధికారిక సర్వే చేయాలి. ఆయా వసతులను బట్టి విద్యార్థులను గ్రూపులుగా విభజించాలి.
– డిజిటల్‌ విద్యను మూడు మాధ్యమాలుగా హెచ్‌ఆర్డీ విడగొట్టింది. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ ఉండి... ఇంటర్నెట్‌ ఉంటే ఆన్‌లైన్‌ మోడ్‌. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ ఉండి ఇంటర్నెట్‌ లేకపోతే పాక్షిక ఆన్‌లైన్‌ మోడ్‌. కేవలం టీవీ, రేడియో ఉండి ఇంటర్నెట్‌ లభ్యత లేకపోతే ఆఫ్‌లైన్‌ మోడ్‌గా పేర్కొంది. ఈ మూడు కేటగిరీలనూ దృష్టిలో పెట్టుకొని పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని పేర్కొంది. 
– పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీచర్ల బోధనకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు/ ట్యాబ్‌లెట్స్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ వంటి కల్పించాలి. 
– ఎక్కువ సమయం ఆన్‌లైన్‌ బోధన వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక సమయం కూర్చొనే క్రమంలో వెన్నెముకపై, కళ్లపై ప్రభావం పడుతుంది. కాబట్టి దీన్ని నివారించాలి

డిజిటల్‌ బోధన అమలు..
– పూర్వ ప్రాథమిక (ప్రీప్రైవురీ) తరగతులకు సంబంధించి తల్లిదండ్రులతో ఇంటరాక్ట్‌ కావాలి. అదీ అరగంటకు మించి ఉండకూడదు.
– 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ జారీ చేసిన ప్రత్యామ్నాయ అకడమిక్‌ కేలండర్‌ను అమలు చేయాలి.
– ప్రాథమిక తరగతులకు ఆన్‌లైన్‌బోధనకు సంబంధించిన నిర్ణయాన్ని రాష్ట్రాలే తీసుకోవాలి.
– 9 నుంచి 12వ తరగతి వరకు రోజుకు నాలుగు సెషన్లకు మించి ఉండకూడదు. 
– రెండు సెషన్లకు మధ్య 10 నుంచి 15 నిమిషాల విరామం విద్యార్థులకు ఇవ్వాలి. దీంతో వారు ఫ్రెష్‌ అప్‌ అవుతారు. 
– ఆన్‌లైన్‌ తరగతులు బోధించే క్రమంలో విద్యార్థులు ఇంటరాక్ట్‌ అయ్యేలా చూడాలి.
– విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ అభ్యసన సమపాళ్లలో ఉండాలి. విద్యార్థులు దీనిని పాటించేలా చూడాలి.
– విషయం 5 బుల్లెట్‌ పాయింట్లకు మించకూడదు.
– గ్రాఫ్‌లు, పటాలు, సాధ్యమైనంతవరకు పట్టికలను నివారించాలి.

వలస కార్మికుల పిల్లల పేర్లు తొలగించకండి
కోవిడ్‌–19 కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికుల పిల్లల పేర్లను పాఠశాలల ఎన్‌రోల్‌మెంట్‌ రోల్స్‌ నుంచి తొలగించకుండా చూడాలని కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చార్డీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇతర ప్రాంతాలకు, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన పిల్లల వివరాలను సేకరించి ఉంచాలని, వీరిని వలస వెళ్లిన వారు, లేక తాత్కాలికంగా అందుబాటులో లేని వారిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. వీరు ఎప్పుడైనా తిరిగి వచ్చే అవకాశాలున్నందున ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రతి స్కూలు ప్రత్యేకంగా ఇటువంటి వారి వివరాలు తయారు చేసి, వారి తల్లిదండ్రులు/ సంరక్షకుల ఫోన్‌ నంబర్లను కూడా తీసుకోవాలని పేర్కొంది. వారు తమ సొంతూళ్లలో ఎంతకాలం ఉన్నారనే విషయం కూడా స్పష్టంగా తెలపాలంది.

ఈ మేరకు తయారైన నివేదికను తరగతుల వారీగా విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పంపించాలని తెలిపింది. అదేవిధంగా, ఇతర ప్రాంతాలు, లేక రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు వచ్చిన చిన్నారులకు పాఠశాలలు విధిగా అడ్మిషన్లు కల్పించాలని కూడా ఆ మార్గదర్శకాల్లో కోరింది. ప్రవేశం కల్పించేందుకు తల్లిదండ్రుల/ సంరక్షకుల గుర్తింపు ధ్రువీకరణ తప్ప, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ వంటివేవీ అడగరాదని స్పష్టం చేసింది. చిన్నారుల సంబంధీకులు ఇచ్చిన సమాచారాన్ని వాస్తమైందిగా భావించి, సమీప ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో ప్రవేశం కల్పించాలని తెలిపింది.

మరిన్ని వార్తలు