భూసర్వేకు కేంద్ర సాయం

19 Aug, 2017 03:24 IST|Sakshi
భూసర్వేకు కేంద్ర సాయం
- తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి హుకుమ్‌సింగ్‌  
 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేకు కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి (భూ వనరులు) హుకుమ్‌సింగ్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమం అత్యంత విప్లవాత్మకమైనదని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం ఆయన తన బృంద సభ్యులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన సమగ్ర భూసర్వేపై చర్చ జరిగింది. దీనిపై సీఎం కేసీఆర్‌ తొలుత మాట్లాడుతూ 1932–36 మధ్య కాలంలో జరిగిన సర్వే ఆధారంగా భూవివరాలు సరిగా లేకపోవడం వల్ల వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతీ ఎకరానికి ఏడాదికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి అందించే కార్యక్రమం ప్రారంభించిందని, ఈ పథకం సక్రమ అమలుకుగాను ఏ భూమి ఎవరి అధీనంలో ఉందో తెలుసుకునేందుకే సర్వే చేస్తున్నట్టు పేర్కొన్నారు.  భూ సర్వే కార్యక్రమానికి కేంద్ర సహకారం కావాలని ఆయన కోరారు. త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రాజెక్టు రిపోర్టు కేంద్రానికి పంపుతామని కేసీఆర్‌ చెప్పారు. అనంతరం హుకుమ్‌సింగ్‌ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి భూ సర్వే నిర్వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్‌ మీనా, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌ రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి భూ వనరు ల విభాగం టెక్నికల్‌ డైరెక్టర్లు గౌతమ్‌ పొత్రు, దినేశ్‌ కుమార్, వెంకటేశ్‌ పాల్గొన్నారు.  
>
మరిన్ని వార్తలు