విధులు-నిధులు-చర్యలు

4 Nov, 2017 01:15 IST|Sakshi

కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై సీఎం స్పష్టత

స్థానిక సంస్థలను క్రియాశీలం చేయడమే లక్ష్యం

పథకాలు ప్రజలకు సమర్థంగా చేరేందుకు వినియోగం

ప్రజాప్రతినిధులకు విధులు, బాధ్యతలపై స్పష్టత

ప్రతి పంచాయితీకి రూ.10 లక్షల నుంచి 25 లక్షల వరకు కేటాయింపు

చట్టం రూపకల్పనపై ప్రగతిభవన్‌లో సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థలు అత్యంత క్రియాశీలకంగా పనిచేసేలా కొత్త పంచాయతీరాజ్‌ చట్టానికి రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో విఫలమైతే చర్యలు తీసుకునే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అవగాహన, అనుభవం కలిగిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంస్థల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. వీలైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి.. చట్టం తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి విజయానంద్, తెలంగాణ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెట్‌ కన్సల్టెంట్‌ జి.జయపాల్‌రెడ్డి, కన్సల్టెంట్లు శంకరయ్య, లింబగిరి స్వామి, ఎన్జీవో ప్రతినిధులు ఎ.పి. రంగారావు, బాలాజీ ఊట్ల తదితరులను ముఖ్యమంత్రి ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఎలా ఉండాలి? స్థానిక సంస్థలకు ఎలాంటి విధులు అప్పగించాలి? వారు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి? నిధులు ఎలా సమకూర్చాలి? ప్రజలకు మరింత జవాబుదారీగా, మరింత క్రియాశీలకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?.. అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

13 వేల వరకు చేరనున్న పంచాయతీలు
రాష్ట్రంలో త్వరలోనే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడతాయని, దాంతో పంచాయతీల సంఖ్య 12–13 వేలు దాటుతుందని సమావేశంలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు విధులు, బాధ్యతలు లేకుండా ఉన్నాయని.. అవి నామమాత్రంగా కొనసాగడానికి వీల్లేదని చెప్పారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వేల కోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అవన్నీ ప్రజలకు నూటికి నూరు శాతం చేరాలంటే స్థానిక సంస్థలు బాగా పనిచేయాలి. ఏ గ్రామానికి ఆ గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఇవన్నీ ప్రజలకు చేరుతాయి. ఇప్పుడున్న విధానం కొనసాగితే ప్రయోజనం లేదు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు ప్రమాదంలో ఉన్నాయి. ఒకప్పుడు కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఏజన్సీలుగా ఉన్న పంచాయతీలు, స్థానిక సంస్థలు రానురాను రాజకీయపరమయ్యాయి. ఇప్పడు సమూలంగా మార్పు రావాలి. గ్రామ పంచాయతీలను శక్తివంతం చేయాలి. ప్రతి కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. ప్రతి గ్రామం మారితేనే యావత్‌ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అందుకే గ్రామ పంచాయతీలు ఎలాంటి విధులు నిర్వర్తించాలి? వారికున్న బాధ్యతలు ఏమిటి? అనే విషయంలో పూర్తి స్పష్టతనిస్తూ కొత్త చట్టం తయారు కావాలి. సర్పంచ్‌ల తరహాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూడా విధులు, బాధ్యతలపై స్పష్టత రావాలి..’’అని పేర్కొన్నారు.

వచ్చే బడ్జెట్‌లో నిధులు..
కేవలం విధులు, బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకుంటే గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా పని చేయలేవని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వాటికి కావాల్సినన్ని నిధులు అందించాలని, వచ్చే బడ్జెట్లో నేరుగా గ్రామ పంచాయతీలకు వాటి జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు సమకూరుస్తామని... కేంద్ర నిధులు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత, ఆర్థిక సంఘం, ఉపాధి హామీ పథకం ద్వారా సమకూరే నిధులన్నీ గ్రామ పంచాయతీలకు అప్పగిస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు శ్రమదానం ద్వారా పనులు చేసుకునే ధోరణిని అలవాటు చేయాలన్నారు. స్థానిక సంస్థలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అన్ని విధాలా సహకారం అందించినా... విధుల నిర్వహణలో విఫలమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండాలని చెప్పారు. వీటన్నింటికీ అవకాశం కల్పించే విధంగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తయారు కావాలని అధికారులకు సూచించారు.

వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలు
నిర్ణీత కాల పరిమితి ప్రకారం వచ్చే ఏడాది పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆ ఎన్నికలు పూర్తవగానే సర్పంచ్‌లకు పూర్తిస్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని.. విధులు, నిధులు, అధికారాలు, బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ‘‘ఎవరి గ్రామ అభివృద్ధి ప్రణాళికను వారే తయారు చేసుకునేలా తర్ఫీదునివ్వాలి. ఆ గ్రామానికున్న అవసరం ఏమిటి, భవిష్యత్తులో వారికి ఇంకా ఏమవసరం.. వంటి అంశాలను బేరీజు వేసుకుని అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాలి. దానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. సర్పంచ్‌లుగా ఎన్నికైన వారిలో చాలామందికి మంచిపేరు తెచ్చుకోవాలనే తపన ఉంటుంది. వారిని ప్రోత్సహించి, అవకాశం కల్పించేలా ప్రభుత్వ విధానం ఉండాలి..’’అని అభిప్రాయపడ్డారు. సమావేశంలో మంత్రులు జూపల్లి, జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ ఎస్‌పీ సింగ్, ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌ నిరంజన్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, కోవ లక్ష్మి, రవీందర్‌నాయక్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కొత్త పంచాయతీలపై ప్రతిపాదనలు
రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు కోరుతూ లేఖలు రాయాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గిరిజన తండాలు, గోండు, కోయ గూడేలు, చెంచు పల్లెలతో పాటు ప్రధాన గ్రామానికి దూరంగా ఉన్న పల్లెలు, గూడేల వివరాలు సేకరించాలని సూచించారు. 500 మందికిపైగా జనాభా ఉన్న ఆవాస ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించినందున.. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించాలని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు