అన్నింటికి సంసిద్ధంగా ఉన్నాం    

28 Mar, 2020 01:19 IST|Sakshi

వైద్యులు, ఇతర వనరుల లభ్యతపై అధ్యయనం చేశాం

కేంద్రం ప్రకటన మేరకు ఏప్రిల్‌ 15 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ 

చికెన్‌ తింటే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధి తగ్గుతుంది

ఏ ఒక్కరినీ ఆకలికి గురికానివ్వం

ఏపీ విద్యార్థులు ఆందోళన చెందొద్దు.. హాస్టళ్లు మూతపడవు

ప్రైవేటులో కరోనా నిర్ధారణ పరీక్షలకు ఇప్పుడే అనుమతి ఇవ్వం

సాక్షి, హైదరాబాద్‌ : ‘పూర్తిస్థాయిలో కరోనా విజృంభించినా అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం అన్నింటికీ 100 శాతం సంసిద్ధంగా ఉన్నం. ధైర్యం కోల్పోయి లేము. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి సోకిన వారికి అందిస్తున్న చికిత్స సరళిని పరిశీలిస్తే 80.9 శాతం మంది స్వల్ప అనారోగ్యానికి గురవుతుండటంతో హోం ఐసోలేషన్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నరు. వారు బతకడానికి అవకాశం ఎక్కువ. అలాగే విషమంగా ఉన్న 13.8 శాతం మంది, తీవ్ర విషమం అవుతున్న 4.8 శాతం మందికే ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నరు. 13.9 శాతం మందిని ఐసోలేషన్‌ వార్డుల్లో, తీవ్రంగా విషమించిన 4.8 శాతం మందిని ఐసీయూల్లో పెట్టి చికిత్స అందిస్తున్నరు. (ఫోన్‌ చేస్తే ఇంటికే సరుకులు)

ఈ లెక్కన రాష్ట్రంలో రోగం బాగా ప్రబలితే మన సంసిద్ధతపై బుధ, గురువారాల్లో ఆరోగ్య మంత్రి, కార్యదర్శి, సీఎస్‌తో కలసి లోతుగా అధ్యయనం చేశాం. ఇంకొకరిపై ఆధారపడకుండా మన స్వశక్తితో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న మన వనరులు, వైద్యులపై లెక్క తేల్చినం. 8 వేల మంది ఐసోలేషన్‌ వార్డులో ఉండేలా ఏర్పాటు చేసుకున్నం. సుమారు 1,400 ఐసీయూ బెడ్స్‌ రెడీ చేసి పెట్టుకున్నం. గచ్చిబౌలి స్టేడియం, గాంధీ మెడికల్‌ కళాశాల, కింగ్‌ కోఠి ఆస్పత్రి రెండు రోజుల్లో సిద్ధం చేస్తున్నం. 500 వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చినం. మొత్తం 11 వేల ఐసోలేషన్‌ బెడ్స్, ఐసీయూ బెడ్స్‌తో పాటు మరికొన్ని బెడ్స్‌ను సిద్ధం చేస్తున్నం.ఈ లెక్కన స్వల్పంగా ఆరోగ్యం విషమించే 80 శాతం మంది అంటే 60 వేల మందికి పాజిటివ్‌గా తేలినా ఇళ్ల వద్ద చికిత్స అందించేందుకు సిద్ధమవుతున్నం’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

అవసరం కన్నా 130 శాతం వైద్యులు, నర్సులు, పారామెడికల్, ల్యాబ్‌ సిబ్బందిని సిద్ధంగా పెట్టుకోవాల్సి వస్తది. వీరందరికి భోజనం, వసతి, ఆస్పత్రులకు రవాణా చేయడానికి అవసరమైన వాహనాలు... వీటన్నింటికి సంసిద్ధమై ఉన్నం. లోపాల్లేకుండా ప్లాన్‌ చేసి పెట్టినం’అని సీఎం పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, సంసిద్ధతకు సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

రిటైర్డు వైద్యుల సేవలు...
8 వేల మంది మంది సర్కారీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నరు. వారికి అదనంగా రిటైర్డ్‌ డాక్టర్లు, కొత్తగా ఎంబీబీఎస్‌ పాసైన 1,100 మంది వైద్యులు అందుబాటులో ఉన్నరు. ల్యాబ్‌ టెక్నిషియన్లను సమీకరిస్తున్నం. వారి సేవల కోసం నోటిఫికేషన్‌ జారీ చేశాం. అవసరమైనప్పుడు వారి సేవలు వాడుకోవడానికి వారి పూల్‌ తయారు చేసి పెడుతున్నం. 14 వేల మంది అదనపు సిబ్బంది సిద్ధంగా ఉన్నరు.

జాగ్రత్తలు తీసుకోకుంటే విస్ఫోటనం ఉండేది..
రాష్ట్రంలో ఇప్పటివరకు 59 మందికి కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఒకరు నయమై ఇంటికి వెళ్లిపోయారు. మిగిలిన 58 మంది చికిత్స పొంతుదున్నారు. మరో 20 వేల మంది హోం క్వారంటైన్, ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో మన నిఘాలో ఉన్నారు. లాక్‌డౌన్‌ చేసి, నైట్‌ కర్ఫ్యూ పెట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆదివారం ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులొచ్చాయంటే పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది కనుక మనం చేయకపోతే చాలా భయంకరంగా, ఇంకా విస్ఫోటనంగా పరిస్థితి ఉండేది. మనందరి బతుకులూ ప్రమాదంలో పడేవి. ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్న. చాలా బాగా సహకరిస్తున్నరు. ఈ వ్యాధికి ఇప్పటివరకు మందు లేకపోవడం యావత్‌ ప్రపంచం ఎదుర్కొంటున్న బలహీనత. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడమే దీనికి పెద్ద మందు. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో 11 వేల వెంటిలేటర్లు ఉండగా ఒక్క న్యూయార్క్‌ సిటీలోనే 3 వేల వెంటిలేటర్లున్నాయి. ఇప్పుడు వారికి 30 వేల వెంటిలేటర్లు అవసరమయ్యాయి. అన్ని వసతులు, ధనం, శక్తి ఉన్న అమెరికా వంటి దేశమే ఆగమాగమై ఉంది. మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సోషల్‌ డిస్టెన్సింగ్‌. స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్యం తప్ప మనకు వేరే మార్గం లేదు. (ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి)

అదమరిస్తే 20 కోట్ల మందికి సోకే ప్రమాదం..    
అమెరికా, చైనా, స్పెయిన్, ఇటలీ స్థాయిలో భారత్‌లో జబ్బు వ్యాప్తి చెందితే 20 కోట్ల మంది దీని బారినపడతారని డబ్ల్యూహెచ్‌ఓ, జాన్‌ హాప్కిన్స్‌ వంటి పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఎవరూ దీనికి అతీతులు కాదు. ఏమైతదిలే అనే నిర్లక్ష్యం పనికి రాదు. శుక్రవారం ఉదయం చాలాసేపు ప్రధానితో మాట్లాడా. అన్ని వేళల్లో అందుబాటులో ఉంటా. ఏ సహకారమైనా అందిస్తాం.. బాగా పోరాడుతున్నారు. దీన్ని గట్టిగా కొనసాగించండి అని ప్రధాని హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. 

ఏప్రిల్‌ 15 వరకు రాష్ట్రం కూడా లాక్‌డౌన్‌...
మనం మార్చి 31 వరకే లాక్‌డౌన్‌ పెట్టుకున్నం. జాతీయ లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 15 వరకు ఉన్నందున మనం కూడా ఏప్రిల్‌ 15 వరకు పొడిగించుకుంటున్నం. కేసులు కూడా ఎక్కువైనయి. కొంత విపత్కర పరిస్థితి. చాలా వరకు కంట్రోల్‌ వచ్చింది. మరింత కంట్రోల్‌ రావాలి. చెక్‌పోస్టుల వద్దకు ప్రజాప్రతినిధులు ఒక్కరే వెళ్లాలి. కూరగాయాలు బ్లాక్‌మార్కెట్‌ జరగకుండా చూడండి. 

ప్రజలు కొన్ని ఓర్చుకోవాలి...
భయంకరమైన విపత్తు, రాక్షసితో మనం యుద్ధం చేస్తున్నం. యుద్ధ సమయంలో సాధారణ పరిస్థితి ఉండదు. మన కోసం కొన్ని ఓర్చుకోవాలి, బాధలు భరించాలి. ప్రభుత్వ, వైద్య, పోలీసు సిబ్బందికి ప్రజలు సహకరించాలి. వారు విరామం లేకుండా పనిచేస్తున్నరు. వారికి సెలవులు లేవు. మాకు చాలా సమస్యలున్నయి. ఎన్నో అంశాలపై పనిచేయాల్సి ఉంది. ప్రజలు సహకరించి ఈ అంశాలపై మమ్మల్ని ఫ్రీగా వదిలేస్తే ఇతర అంశాలపై పనిచేసుకోగలం. మాకు రాత్రీపగలు ఉండదు. ఇతర సామాజిక అవసరాలు తీర్చాలి... పొట్టలు నిండాలి. ప్రజలకు పాలు, కూరగాయాలు రావాలి. వాటి రవాణా జరగాలి.

ఏపీ విద్యార్థులు ఆందోళన చెందొద్దు...
తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్రం, ప్రాంతం వారైనా మీ పొట్టలు మేము నింపుతాం. హాస్టళ్లు బంద్‌ సమస్యలు రానియ్యం. ఒక్కరినీ పస్తులుండనీయం. ఆందోళన చెందొద్దు. ఎక్కడ ఉన్నోళ్లు అక్కడ ఉండండి. మీ వెంట పోలీసులు పరిగెత్తాలంటే చాలా టైం పోతది. ప్రభుత్వ శక్తి వృథా అవుతది. శక్తి ఖర్చు అయితే విపత్తును ఎదుర్కోవడం ఇబ్బంది అవుతది. హాస్టళ్లు మూసేస్తరని ఏపీ పిల్లలు ఆందోళన చెందుతున్నరు. ఎట్టి పరిస్థితుల్లో మూయరు. మీకు ఇక్కడ్నే అన్నం పెడ్తరు. ఇక్కడే ఉండండి. ఈ విపత్కర పరిస్థితిలో ఒకచోట నుంచి మరోచోటుకు వెళ్లొద్దు. సాధ్యమైనంత వరకు కదలికలను నిరోధించండి. అదే మన దేశాన్ని కాపాడుతుందని ప్రధాని ఈ రోజు నాతో అన్నారు. దేశంలో హై ఎండ్‌ టెక్నాలజీ, భారీ సంఖ్యలో వెంటిలేటర్లు లేవు. కాబట్టి ప్రజల కదలికలను నిరోధించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు అని ప్రధాని అన్నరు.

ఇతర రాష్ట్రాల కూలీలు పస్తులండవద్దు..
ఈ విపత్కర సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడా ఆకలికి గురికావద్దు. పేదలు, యాచకులు, నైట్‌ షెల్టర్లలో ఉండేవారు, ఇతర రాష్ట్రాల కూలీలు, అనాథలు, వృద్ధాశ్రమాల్లో ఉండేవాళ్ల ఆకలి తీర్చుతాం. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా నుంచి వచ్చి మన దగ్గర నిర్మాణ రంగం, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్నరు. చాలా రైస్‌ మిల్లుల్లో హమాలీలుగా, పౌల్ట్రీ పరిశ్రమలో బిహార్‌వాసులు పనిచేస్తున్నరు. వారి బాగోగులు చేసుకోవాలని, అన్నం పెట్టి ఆదుకోవాలని వారి యజమానులకు చెప్పినం. క్రెడాయ్‌ వాళ్లు మున్సిపల్‌ మంత్రిని కలిసి అంగీకారం ఇచ్చారు. ఎట్టి పరిస్థితిల్లో వేరే రాష్ట్రాల వారు మీ జిల్లాల్లో ఉంటే వారికి ఆహారం, ఆశ్రయం కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. దీనికి ఎంత ఖర్చియినా పరవాలేదు. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలి. జీహెచ్‌ఎంసీతోపాటు పీర్జాదిగూడ, బడంగ్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, జల్పల్లి, మీర్‌పేట్, బండ్లగూడ జాగీర్, జవహర్‌ నగర్‌ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల కూలీలున్నరు. వారందరినీ ఆదుకొనే బాధ్యత మన మీద ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లు, జీహెచ్‌ంసీ మేయర్, పురపాలక మంత్రి, కార్యదర్శి సమన్వయంతో పనిచేయాలి. ఖర్చు కోసం వెనకాడొద్దు.

చికెన్‌ తింటే కోవిడ్‌ రాదు..
పౌల్ట్రీ ఫీడ్, పాలు, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు, పశుగ్రాసం రవాణా వాహనాలను అనుమతిస్తాం. డెయిరీ ఫారం నిర్వాహకులు ఫీడ్‌ సరఫరాదారులకు ఫోన్‌ చేసి గడ్డి తెప్పించుకోవచ్చు. పోలీసులు వాహనాలను ఆపరు. చికెన్, కోడిగుడ్లను బయటి రాష్ట్రాలకు సరఫరా చేయొచ్చు. చికెన్‌ తింటే కోవిడ్‌ వస్తదని దుర్మార్గులు తప్పుడు ప్రచారం చేశారు. చికెన్‌ తింటే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధి తగ్గుతుంది. శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి చికెన్, గుడ్లు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో సీ–విటమిన్‌గల సంత్ర, బత్తాయి, నిమ్మ పండ్లు వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అంటున్నరు. నల్లగొండ జిల్లా, ఇతర జిల్లాల్లో పండే బత్తాయి పంటలను ఇతర రాష్ట్రాలకు పంపకుండా మన రాష్టాల ప్రజలకు అందుబాటులో ఉంచాలి. హైదరాబాద్‌లోని అన్ని కాలనీలు, అన్ని రైతుబజార్లలో అందుబాటులో పెట్టండి. త్వరలో మామిడి పండ్లు కూడా వస్తయి. మనవి మనకే వాడుకోవాలి. జిల్లా, తాలుకా కేంద్రాలు, పురపాలికలకు పంపించండి. వాహనాలకు ప్రత్యేక పాసులు ఇవ్వండి.

మన తెలివితేటలతోనే బయటపడగలం..
మంచి నియంత్రణలో ఉన్నం. విమానాలు, పోర్టులు బంద్‌ కావడంతో అంతర్జాతీయంగా వ్యాధి మనకు వచ్చే పీడ పోయింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా గూడ్స్‌ తప్ప ఇతర వాహనాలు రావడం లేదు. రాష్ట్రంలోనే ఒకరి నుంచి ఒకరికి అంటించే ప్రమాదం లేకుండా చూసుకోవాలి. కొందరు మూర్ఖంగా, అమాయకంగా ప్రవర్తించడం వల్ల రాష్ట్రంలో కొందరు స్థానికులకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధమై ఉంది. ఎంత దూరం పోయినా ఎదుర్కోవడానికి సంసిద్ధమై ఉన్నం. అత్యవసరమైతే సాయం చేస్తామని ప్రధాని అన్నరు. మన చేతిలోని ఏకైక ఆయుధం వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడటమే. ఆధునిక వసతులు లేని, వెంటిలేటర్లు లేని, వైద్య సదుపాయాలు లేని మన దేశం మనకున్న తెలివితేటలతోనే బయటపడాలి.

ప్రైవేటులో పరీక్షలకు నో..
కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షల విషయంలో ప్రైవేటు ఆస్పత్రులకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. మన దగ్గరున్న విజయ, అపోలో, వింటాల్‌ డయాగ్నస్టిక్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మా శక్తి అంతా వినియోగం అయిపోయాక వారికి అనుమతి ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 5 పరీక్షా కేంద్రాలకు అనుమతి ఉండగా ఇంకో కేంద్రానికి త్వరలో అనుమతి రానుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సీసీఎంబీకి రోజుకు 800 నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. ఇవన్నీ పూర్తి సామర్థ్యంతో వాడకంలోకి వచ్చాకే ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తం. టెస్టుల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను దోచుకోవడానికి అనుమతి ఇవ్వం.  

మరిన్ని వార్తలు