2024లో సంకీర్ణ సర్కారు ఖాయం.. బీఆర్‌ఎస్‌దే హవా: సీఎం కేసీఆర్

15 Nov, 2023 16:04 IST|Sakshi

నిజామాబాద్‌: 2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పడటం ఖాయమని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజల అండ ఉంటుందని ఆకాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణను ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నిజామాబాద్ బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం:కేసీఆర్

బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తోందని అన్నారు. రైతు దుబారానా? అని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నాయకుల మాటలను ఎండగట్టారు. ఈ ప్రాంతానికి ఆనాడు నీళ్లు ఎందుకివ్వలేదని దుయ్యబట్టారు.  ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

తలసరి ఆదాయంలో తెలంగాణ నేడు ప్రథమ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు లాంటి పథకాలను దేశంలో తెలంగాణ మాత్రమే అమలు పరుస్తోందని చెప్పారు.

కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు
ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుని మత కలహాలు సృష్టించిందని విమర్శించారు. హిందూ, ముస్లింలు సోదరభావంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ మత పిచ్చితో మంటలు పెడుతోందని ఆరోపించారు. వంద ఉత్తరాలు రాసినా కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీగాని నవోదయ పాఠశాల గానీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. 

సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించామని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే భయంకర పరిస్థితులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు బీడీ కార్మికులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. 2014 తర్వాత చేరిన కొత్త బీడీ కార్మికులందరికి పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను 5016కు పెంచుతామని వెల్లడించారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌.. రంగంలోకి ఏఐసీసీ పెద్దలు!

మరిన్ని వార్తలు