ఇంటికో ఉద్యోగం ఏమైంది?

18 Mar, 2015 04:33 IST|Sakshi
ఇంటికో ఉద్యోగం ఏమైంది?

- లక్షన్నర ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఏవీ?
- సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్ ప్రశ్న

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ కావాలన్న కేసీఆర్ ..సీఎంగా ఏం చేస్తున్నాడని నిలదీశారు.

అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ 10 నెలల్లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడన్నారు. ఈ 10 నెలల్లో ఇంటికో ఉద్యోగం కాదు, ఊరికో ఉద్యోగం కూడా రాలేదన్నారు. ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో 1,07,722 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాస్తవానికి లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.  ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
 
మండలి ఎన్నికలు ప్రతిష్టాత్మకం: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. పార్టీ అనుబంధసంఘాల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలతో గాంధీభవన్‌లో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే గెలుపు సాధ్యమన్నారు.
 
వ్యూహాత్మకంగా ఉంటే గెలుస్తాం..

శాసనమండలి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పనిచేస్తే గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ముఖ్యులతో గాంధీభవన్‌లో వీరు సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో పట్టభద్రుల్లో అసంతృప్తి నెల కొందన్నారు. ఈ ఎన్నికల్లో పనిచేస్తే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఉపయోగపడుతుందన్నారు.

మరిన్ని వార్తలు