కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు

18 Oct, 2014 23:41 IST|Sakshi

నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేసేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు
 
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత, వృత్తి విద్య కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలకే పెద్దపీట వేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన వైఖరి అవలంభించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) తదితర అన్ని ఉన్నత విద్యా కోర్సులను నిర్వహించే కాలేజీల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టాలనే ఆలోచనలు చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించాక త్వరలోనే టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీల నేతృత్వంలో తనిఖీలు చేపట్టి నాణ్యత, ప్రమాణాలు పాటించే కాలేజీలనే కొనసాగించాలనే యోచన చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 726 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా, ఈ ఏడాది మరో 150 కాలేజీలకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇచ్చింది. అయితే అవసరం లేని చోట కాలేజీలకు అనుమతులు పొందారని, రాజకీయ పరపతితో అనుమతులు తెచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు కూడా అందాయి. నిబంధనల ప్రకారం నాలుగైదు జూనియర్ కాలేజీలున్న మండలంలో ఒక డిగ్రీ కాలేజీకి మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉండగా... ఒకట్రెండు జూనియర్ కాలేజీలు ఉంటే.. నాలుగైదు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి.

యూనివర్సిటీల నుంచి తనిఖీలకు వెళ్లిన బృందాలు అలాంటి ప్రాంతాల్లో కొత్త కాలేజీల అనుమతులకు ఎలా సిఫారసు చేశారన్న అంశాలపైనా విచారణ జరిపి, చర్యలు చేపట్టాలనే ఆలోచనలు చేస్తోంది. తద్వారా భవిష్యత్తులో ఇష్టారాజ్యంగా కాలేజీల ఏర్పాటుకు తప్పుడు నివేదికలు ఇవ్వకుండా చూడాలని భావిస్తోంది. ఇప్పటికే మూడు నాలుగు కాలేజీలున్న చోట వాస్తవ అవసరాలను బట్టి ఎన్ని కాలేజీలను కొనసాగించాలనే విషయాలపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది. ఇందుకు నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల అఫిలియేషన్లను రద్దు చేసే యోచన కూడా చేస్తోంది. మరోవైపు అనేక బీఎడ్ కాలేజీల్లో అధ్యాపకులే లేరు. తరగతులూ కొనసాగడం లేదు. అవి సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా మారినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వీటితోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర ఉన్నత విద్యా కాలేజీలు అన్నింట్లో తనిఖీలు చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
 
 

మరిన్ని వార్తలు