అన్ని పార్టీలపై ఆదరణ

29 Oct, 2018 08:53 IST|Sakshi

బోధన్‌ నియోజక వర్గం తన ప్రస్థానంలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులనూ ఆదరించింది. కాంగ్రెస్‌ ఆరు పర్యాయాలు, టీడీపీ నాలుగు పర్యాయాలు విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఈ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పట్టం కట్టింది. బీజేపీ అభ్యర్థులు పలుమార్లు గట్టి పోటీ ఇచ్చినా విజయ శిఖరాలను మాత్రం అందుకోలేకపోయారు.

బోధన్‌: బోధన్‌ నియోజక వర్గం 1952 సంవత్సరంలో ఏర్పడింది. ఈ నియోజక వర్గం పరిధిలో బోధన్‌ పట్టణం, మండలం, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాలున్నాయి. నియోజ వర్గం ఏర్పడి నాటి నుంచి ఆరుసార్లు కాం గ్రెస్‌ పార్టీకి, నాలుగు సార్లు టీడీపీ, మరో నాలుగు సార్లు స్వతంత్ర అభ్యర్థులకు అధికారం కట్టబెట్టారు. 1999 నుంచి 2009 వరుకు  వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శ న్‌ రెడ్డి హ్యాట్రిక్‌ సాధించారు. టీడీపీ హయాం లో దివంగత మాజీ మంత్రి బషీరుద్దీన్‌ బాబూఖాన్‌ 1985,1994 ఎన్నికల్లో  రెండు పర్యాయాలు గెలుపొందారు.1983 నుంచి 1994 వరకు వరుసగా నాలుగుసార్లు టీడీపీకి ఓటర్లు పట్టం కట్టారు.1994, 2004, 2009 లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా అధికారం దక్కలేదు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డిపై 15 వేల పైచిలుకు ఓట్లతో ఆధిక్యత సాధించి  గెలుపొందారు. 2009లో మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి (కాంగ్రెస్‌), మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ (టీఆర్‌ఎస్, టీడీపీ మహాకూటమి) అభ్యర్థులుగా బరిలో నిలిచారు. షకీల్‌ పై సుదర్శన్‌ రెడ్డి 1200 పై చిలుకు ఓట్ల ఆధిక్యత సాధించి గెలుపొందారు.

1957 నుంచి 1972 వరకు వరుసగా నాలుగు సార్లు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాస్‌రావు, రాంగోపాల్‌రెడ్డి, కెవీరెడ్డి, ఆర్‌ భూంరావులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ నియోజవర్గ ముఖ్య నేత కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి 2004లో తెలంగాణ జనతా పార్టీ, 2009లో ప్రజారాజ్యం పార్టీ ల అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. 2009లో 34 వేల 142 ఓట్లుసాధించి సత్తాచాటారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన మేడపాటి ప్రకాష్‌ రెడ్డి 26 వేల 558 ఓట్లు పొంది సత్తా చాటారు. ఆయన ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. ఇదే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన కాటిపల్లి సుదీప్‌ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచి ప్రధాన రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేశారు. 

మరిన్ని వార్తలు