‘గ్రేటర్‌’పై కరోనా పంజా

5 May, 2020 09:40 IST|Sakshi
వనస్థలిపురంలో..

కరోనాతో ఇద్దరు మహిళలు మృతి

జియాగూడ వెంకటేష్‌నగర్, జయానగర్‌ కాలనీలో ఘటనలు

గ్రేటర్‌లో 27కు చేరిన కరోనా మరణాలు

వనస్థలిపురం, జింకలబావి కాలనీల్లో పాజిటివ్‌ కేసులు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ మృత్యుఘంటికలు మోగిస్తుంది. సోమవారం నగరంలో మరో ఇద్దరు మృతి చెందడంతో గ్రేటర్‌లో కరోనా మృతుల సంఖ్య 27కు చేరింది. వీరిలో ఒకరు జియాగూడ వెంకటేష్‌నగర్‌కు చెందిన మహిళ కాగా..మరొకరు బన్సీలాల్‌పేటలోని జయానగర్‌కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు ఉండటం గమనార్హం. ఇక వనస్థలిపురం, జింకలబావికాలనీ, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రికి కొత్తగా ముగ్గురు అనుమానితులు రాగా, ప్రస్తుతం ఆస్పత్రిలో రెండు పాజిటివ్, నాలుగు సస్పెక్టెడ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. ఇక కింగ్‌ కోఠి ఆస్పత్రికి కొత్తగా ఏడుగురు అనుమానితులు రాగా, వీరిని అడ్మిట్‌ చేసుకుని వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారిలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారిని గాంధీకి తరలించారు. నెగిటివ్‌ వచ్చిన 9 మందిని డిశ్చార్జ్‌ చేశారు. ఇక ఫీవర్‌ ఆస్పత్రికి కొత్తగా ఏడుగురు అనుమానితులు రాగా, వారి నుంచి స్వాబ్స్‌ తీసి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. (కరోనా: మొన్న కూతురు.. నేడు తల్లి!)

జయానగర్‌లో రిటైర్డ్‌ టీచర్‌ మృతి
బన్సీలాల్‌పేట: ఐడిహెచ్‌ కాలనీ సమీపంలోని జయనగర్‌ కాలనీ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు(62) సోమవారం మృతి చెందారు.గాల్‌ బ్లాడర్‌ సమస్యతో బాధపడుతున్న బాధితురాలిని ఏప్రిల్‌  21న కుటుంబీకులు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఆ తర్వాత సదరు మహిళకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిందని గాంధీనగర్‌ పోలీసులు తెలిపారు.

జియాగూడలో అత్తా కోడళ్లు మృతి
జియాగూడ: జియాగూడ వెంకటేష్‌ నగర్‌లో నివసిస్తున్న వృద్ధురాలు(72) గత వారం కరోనా సోకి మృతి చెందగా, తాజాగా సోమవారం ఆమె కోడలు (55) కరోనా పాజిటివ్‌తో మృతి చెందినట్లు కుల్సుంపురా ఎస్సై సత్యనారాయణ తెలిపారు. మిగిలిన కుటుంబ సభ్యులను ఆస్పత్రికి పంపి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.

వనస్థలిపురంలో మరో పాజిటివ్‌..  
వనస్థలిపురం: బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ ఎస్‌కేడీ నగర్‌లో సోమవారం  ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు  తెలిపారు. ఇప్పటికే ఆయన భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో కరోనాతో మృతిచెందిన ఆలంపల్లి ఈశ్వరయ్య, మధుసూదన్‌లకు వీరు దగ్గరి బంధువులు కావడం గమనార్హం. సోమవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, అధికారులతో కలసి ఆయా ప్రాంతాలలో పర్యటించారు. 

గుడిమల్కాపూర్‌ మరో వ్యక్తికి...
గోల్కొండ: గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మార్కెట్‌ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి మార్కెట్‌లో కూరగాయలు కొన్న షాపును గుర్తించి ఆ షాపుతో పాటు మరో 5 షాపులు మూసివేయించారు. మూడురోజుల పాటు మార్కెట్‌ను మూసి ఉంచితున్నట్లు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. 

జింకలబావి కాలనీలో ఒకే కుటుంబంలో ఇద్దరికి..
హుడాకాంప్లెక్స్‌: సరూర్‌నగర్‌లో మరొక కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధి జింకలబావి కాలనీలో రెండు రోజుల క్రితం డయాలసిస్‌ పేషెంట్‌ (72)కు కరోనా పాజిటివ్‌ రావటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను, అద్దెకు ఉంటున్న కుటుంబాలను సెల్ఫ్‌ క్వారంటైన్‌లో వుంచారు. సోమవారం ఆయన కుమారుడికి పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో అప్రమత్తమైన వైద్యాధికారులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ హరికృష్ణయ్య తెలిపారు. 

>
మరిన్ని వార్తలు