‘కరోనా’ఎఫెక్ట్‌..నాడి పట్టేదెవరు?

2 Apr, 2020 03:29 IST|Sakshi

క్లినిక్స్, డయాగ్నస్టిక్‌ సెంటర్లు మూత

ముందుజాగ్రత్త పేరుతో ఆదేశాల జారీ

సామాన్యులకు అందని వైద్యసేవలు

పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి.. పేదల ఇక్కట్లు 

కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో అన్ని క్లినిక్‌లు, ఫస్ట్‌ ఎయిడ్, డయాగ్నస్టిక్‌ కేంద్రాలను తక్షణమే మూసివేయాలి. ఎలాంటి ఓపీ సేవలకు అనుమతి లేదు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మార్చి 27న రంగారెడ్డి జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ జారీచేసిన ఆదేశాలివీ

సాక్షి, హైదరాబాద్‌: అత్యవసర వైద్య సేవలందించే వైద్యులు, సిబ్బందికి కరోనా వైరస్‌ సోకకూడదనే కారణంతో క్లినిక్‌లు, వ్యాధి నిర్ధారణ, డయాగ్నస్టిక్‌ కేంద్రాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో అత్యవసర వైద్య సేవలు బంద్‌ అయ్యాయి. క్లినిక్‌లు, సీజనల్‌ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి సేవలందించే ప్రథమ చికిత్స కేంద్రాలు పనిచేయడం లేదు. ఇందుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా, మిగతాచోట్ల కూడా ఇదే తరహాలో క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లను మూసివేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే అత్యవసర వైద్య సేవలందించే క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల మూసివేతతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కొత్త సమస్యలు వచ్చిపడు తున్నాయి. సాధారణంగా చిన్నచిన్న అనారోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలోని క్లినిక్‌లు చికిత్స అందించేవి. ప్రమాదాల బారినపడితే ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లు తక్షణ సేవలందించేవి. ఇక, అనారోగ్య కారణాలను తెలిపేందుకు డయాగ్నస్టిక్‌ సెంటర్లు వివిధ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవి. ఆయా సేవలు పొందడంలో క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల పాత్ర కీలకం. ప్రస్తుతం వీటిని మూసివేయడంతో సాధారణ ఆరోగ్య సేవలకు విఘాతం కలుగుతోంది. రోగానికి తగిన మందు వేసుకోకుంటే ఇతర అనారోగ్య సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.

అత్యవసరమైతే.. ఇబ్బందే
క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల మూతతో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా, సీజనల్‌ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే.. అంతే సంగతులన్నట్టు పరిస్థితి మారింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ ఓపీ సేవలు అందడం లేదు. ప్రస్తుతం పేదలకు పెద్దదిక్కుగా ఉన్న గాంధీ ఆస్పత్రిని కరోనా ఆస్పత్రిగా మార్చారు. దీంతో అక్కడ రోజువారీ ఓపీ సేవలకు అవకాశం లేదు. ఉస్మానియా ఆస్పత్రిలోనూ, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సాధారణ వైద్యసేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆయా అనారోగ్య కారణాలకు సకాలంలో వైద్య సేవలందక ఇబ్బందులు పడుతున్నారు.  

మరిన్ని వార్తలు