తెలంగాణలో కొత్తగా 872 కేసులు

22 Jun, 2020 21:18 IST|Sakshi

గ్రేటర్‌లో 713, రంగారెడ్డిలో 107

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రెండు మూడు రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఏకంగా 872 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా 713 మంది గ్రేటర్‌వాసులు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌ జిల్లాలో 16, సంగారెడ్డి జిల్లాలో 12, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 6, మంచి ర్యాల జిల్లాలో 5, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలో 3 చొప్పున, జనగామ, కరీంనగర్, మహబుబాబాద్‌ జిల్లాలో రెండు చొప్పున, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఒక కేసు నమోదైంది.

దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 8,674కి చేరింది. 4,452 మంది వివిధ ఆస్పత్రులు, హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతుండగా.. 4,005 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. సోమవారం ఏడుగురు మృతిచెందగా.. ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 217కి పెరిగింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 3,189 మందికి పరీక్షలు నిర్వహించగా.. 27.34 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 60,243 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

గ్రేటర్‌లో కరోనా కల్లోలం..
రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 8,674 కేసుల్లో 6,511 కేసులు గ్రేటర్‌ పరిధిలోనే ఉన్నాయి. అలాగే మొత్తం 217 మరణాల్లో 197 మంది గ్రేటర్‌వారే కావడం గమనార్హం. ఖైరతాబాద్‌లో క్లినిక్‌ నిర్వహిస్తున్న ఓ డాక్టర్‌ ఆదివారం రాత్రి మృతిచెందగా.. ఓ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై సోమవారం కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

కాగా, సోమవారం మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు సహా 9 మందికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ కావడంతో రెండు రోజులపాటు ఆస్పత్రి సేవలు నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. అలాగే నగరంలోని ఓ కార్పొరేటర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమె కుటుంబంలోని ఐదుగురికి కూడా వైరస్‌ సోకింది. ఆ కార్పొరేటర్‌ ఇటీవల మంత్రి తలసానితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు