కరోనా: యాదాద్రిలో 4.. మంచిర్యాలలో 3

11 May, 2020 03:52 IST|Sakshi

సాక్షి, యాదాద్రి/మంచిర్యాల: ఇప్పటి వరకు గ్రీన్‌జోన్‌లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బతుకుదెరువు కోసం ముంబైకి వలస వెళ్లొచ్చిన కూలీలకే పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ముంబైలో కరోనా విలయతాండవం చేస్తున్న ధారావి, శాంతకృజ్‌ ప్రాంతాల నుంచి వీరంతా ఇటీవల జిల్లాలోని స్వస్థలాలకు వచ్చారు. 

సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాంలో ఒకరికి, ఆత్మకూరు (ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో ముగ్గురికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు తేలిందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. అయితే వారు జిల్లాకు రాగానే క్వారంటైన్‌కు పంపించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. మరోవైపు పల్లెర్ల గ్రామంలో ఉన్న పాజిటివ్‌ లక్షణాలు గల వ్యక్తులు ఎవరెవరిని కలిశారోనన్న కోణంలో సెకండ్‌ కాంటాక్ట్‌ వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక యాదాద్రి జిల్లాకే చెందిన కొంతమంది వలస కార్మికులను హైదరాబాద్‌లోనే అడ్డుకుని క్వారంటైన్‌కు తరలించగా.. వారిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన నలుగురికి ఇప్పటికే పాజిటివ్‌ అని తేలింది. 
(చదవండి: కరోనా: తెలంగాణలో మరో 33 మందికి)

దీంతో ఆ జిల్లాకు చెందిన మొత్తం 8 మంది వైరస్‌ బారిన పడినట్టయింది. మరోవైపు మంచిర్యాల జిల్లాలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ వచ్చిన వారిలో తండ్రి కొడుకుతోపాటు తండ్రి సోదరుడు కూడా ఉన్నారు. వీరు ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని బాంద్రాలో ఇంటి ఆస్తి పరిష్కారం కోసం వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. ఇటీవల లాక్‌డౌన్‌ సడలించడంతో ఈ నెల 5వ తేదీన సొంతూరు హాజీపూర్‌ మండలం రాపల్లికి తిరిగి వచ్చారు. వారి నుంచి నమూనాలు సేకరించి గాంధీ ఆస్పత్రికి పరీక్షల కోసం పంపగా ఆదివారం ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది. అయితే ఈ మూడు కేసులు జిల్లా పరిధిలోని కేసులుగా గుర్తించలేమని వలస వెళ్లిన కేసుల జాబితాలోనే పేర్కొంటామని జిల్లా అధికారి డాక్టర్‌ బాలాజీ తెలిపారు.  
(చదవండి: బర్త్‌డేలో సూపర్‌ స్ప్రెడ్‌!)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు