ఏ ఒక్కరినీ తొలగించొద్దు: కేటీఆర్‌

21 Apr, 2020 01:52 IST|Sakshi
జిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కేటీఆర్‌

కార్మికులకు మే నెల జీతాలు చెల్లించాలి

సాక్షి,హైదరాబాద్‌: ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించరాదని, మే నెలలో కూడా కార్మికులు, ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. పరిశ్రమలు మూతపడటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందని,∙విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యంపై ఉందని కోరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలసి సోమ వారం జీహెచ్‌ఎంసీ కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి అన్నిజిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యుత్‌ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపు విషయంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించిందని గుర్తు చేశారు.  

వారి బాధ్యత మనమీదే... 
శాశ్వత ఉద్యోగులతో పాటు వలస కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మానవీయకోణంలో వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యాన్ని, రూ.500 నగదును ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ఫ్యాక్టరీల వద్దే ఉండిపోయిన కార్మికులకు నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్‌కార్డులేని వారికి బియ్యం, నగదు మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కల్పించామన్నారు. పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వలస కార్మికులు రోడ్డు మీదకు వస్తే ఇప్పటి వరకు అమలు చేసిన లాక్‌డౌన్‌ వృథా అవుతుందని, అందుకే ఎక్కడి కార్మికులను అక్కడే ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు.  
   
ఇళ్లలోనే రంజాన్‌

పవిత్ర రంజాన్‌ నెల ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకుంటూ కరోనా వైరస్‌ నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా సహకరిం చనున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్స్‌ కోసం వచ్చిన మంత్రి కేటీఆర్‌ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలను ముస్లిం మత పెద్దలు ఖుబుల్‌ పాషా సత్తారి, ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్, మహ్మద్‌ పాషా, ఇఫ్తెకారి పాషాల బృందం స్వచ్ఛందంగా కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్‌ మాసం నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించడానికి తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్థనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు