Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి!

Published Tue, Apr 21 2020 1:55 AM

Vijaysen Reddy Elevated As Telangana Highcourt Judge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సోమవారం సిఫారసు చేసింది. న్యాయవాదుల కోటా నుంచి ఆయన పేరును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 డిసెంబర్‌ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు.

ఉమ్మడి ఏపీ మానవహక్కుల కమిషన్‌ తొలి చైర్మన్‌గా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాలకు లోకాయుక్తగా జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి పనిచేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డికి విజయ్‌సేన్‌రెడ్డి మేనల్లుడు. న్యాయవాదిగా విజయ్‌సేన్‌రెడ్డికి మంచి పేరుంది. అన్ని స్థాయి కోర్టుల్లోనూ కేసుల్ని వాదించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో రాజ్యాంగపరమైన కేసులతో పాటు సివిల్, క్రిమినల్‌ కేసులను వాదించడంలో మంచిపేరు సంపాదించారు. ఆయన వద్ద ఎంతోమంది న్యాయవాదులు జూనియర్లుగా చేశారు. ప్రస్తుతం ఆయన వద్ద 20 మంది జూనియర్లు ఉన్నారు. క్రీడల పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. టేబుల్‌టెన్నిస్, టెన్నిస్, స్విమ్మింగ్‌ పోటీల్లో పలు బహుమతులు సాధించారు.

న్యాయ శాస్త్రాన్నే కాకుండా ఇంగ్లిష్, తెలుగు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. పుస్తక పఠనం ఆయన అభిరుచి. కాగా, విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి కేంద్రం సమ్మతి తెలిపి రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత న్యాయమూర్తిగా నియమితులవుతారు. ప్రస్తుతం హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 12 మంది ఉన్నారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకం అయితే ఇంకా 11 పోస్టులు ఖాళీగా ఉంటాయి. 2019 మే 1న జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి కన్నుమూశారు. విజయ్‌నేన్‌రెడ్డికి తాత 104 ఏళ్ల బి.ఆగారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు.  

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయవాదులు.. బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్‌ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిల పేర్లకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు మొత్తం ఆరుగురి పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ జాబితాలో కృష్ణమోహన్, సురేష్‌ రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్‌రెడ్డి, జీఎల్‌ నర్సింహారావు, కె.మన్మథరావులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాపై చర్చించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన కొలీజియం ముగ్గురి పేర్లను కేంద్రానికి పంపింది. ఈ ముగ్గురిలో లలితకుమారి పిన్న వయస్కురాలు. ప్రస్తుతం ఆమె వయసు 48 ఏళ్ల 11 నెలలు. వీరి పేర్లకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే, రాష్ట్రపతి నియామక ఉత్తర్వులిస్తారు.  

Advertisement
Advertisement