వణికిస్తున్న కరోనా

18 Jun, 2020 11:44 IST|Sakshi

ఇందులో జిల్లావాసులు నలుగురు

బాధితుడు సుల్తానాబాద్‌ వీఆర్‌ఏ 

కరీంనగర్‌లో సోకిన వైరస్‌!

హోంక్వారంటైన్‌లో తహసీల్దార్‌తోపాటు 17 మంది

వీరందరికీ నేడు వైద్యపరీక్షలు

కరోనా వైరస్‌ జిల్లాను వణికిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటివరకు తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదైన పెద్దపల్లి జిల్లాలో తాజాగా కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన వీఆర్‌ఏతోపాటు ఆరుగురు కుటుంబసభ్యులు కరోనాబారినపడ్డారు. ఇందులో జిల్లావాసులు నలుగురు. మిగతా ఇద్దరు కరీంనగర్‌ జిల్లావాసులు. బాధిత వీఆర్‌ఏ సుల్తానాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వంటలు చేస్తుండడంతో తహసీల్దార్‌తోపాటు 17 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచారు.

సాక్షి, పెద్దపల్లి : సుల్తానాబాద్‌ పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన వీఆర్‌ఏ, అతడి కుటుంబ సభ్యులు ఆరుగురికి మంగళవారం కరోనా నిర్ధారణ అయింది. ఇందులో వీఆర్‌ఏ, కుటుంబసభ్యులు ముగ్గురు సుల్తానాబాద్‌ పట్టణవాసులు. మిగతా ఇద్దరు కరీంనగర్‌వాసులు. బాధితులంతా ఇప్పటికే కరీంనగర్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా కరీంనగర్‌లో ఆయన అల్లుడి గృహప్రవేశానికి వెళ్లిన సందర్భంలోనే వీఆర్‌ఏ కుటుంబానికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 7వ తేదీన కరీంనగర్‌లో వీఆర్‌ఏ అల్లుడైన కానిస్టేబుల్‌ గృహప్రవేశం చేశాడు. అంతకురెండు రోజుల ముందే కానిస్టేబుల్‌ హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వచ్చారు. గృహప్రవేశం తరువాత జ్వరంతో బాధపడుతుండడంతో పరీక్షలు నిర్వహించగా ఈ నెల 9వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణఅయింది. దీంతో కాంటాక్ట్‌లో ఉన్న వీఆర్‌ఏతోపాటు ఆయన కుటుంబసభ్యులను కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌లో ఉంచారు. మంగళవారం వీఆర్‌ఏ కుటుం»బసభ్యుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా, కోరోనా పాజిటివ్‌గా బుధవారం నిర్ధారణఅయింది.

హోంక్వారంటైన్‌లో తహసీల్దార్‌తోపాటు 17 మంది
వీఆర్‌ఏ కాంటాక్ట్‌లపై అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈనెల 7వ తేదీన కరీంనగర్‌లో గృహప్రవేశం అనంతరం వీఆర్‌ఏ సుల్తానాబాద్‌కు వచ్చి, 9, 10 తేదీల్లో రెండురోజులపాటు తహసీల్‌ కార్యాలయ అధికారులు, సిబ్బందికి భోజ నం వడ్డించాడు. తహసీల్దార్‌తోపాటు, నాయబ్‌ తహసీల్దార్, సీనియర్‌ అసిస్టెంట్, ఆర్‌ఐ,టైపిస్ట్, ఎనిమిది మంది వీఆర్‌వోలు, ఇద్దరు సీవోలు, ఇద్దరు వీఆర్‌ఏలు మొత్తం 17 మందిని వారం రోజుల పాటు హోంక్వారంటైన్‌కు పంపించారు. వీరందరికి గురువారం వైద్యపరీక్షలు చేయనున్నట్లు సమాచారం. పెద్దపల్లి తహసీల్దార్‌ డి.శ్రీనివాస్‌కు సుల్తానా బాద్‌ తహసీల్దార్‌గా, ఎం.శివకుమార్‌కు నాయబ్‌ తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ సిక్తా పట్నా యక్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ వారంరోజుల్లో తహసీల్దార్‌ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన సందర్శకుల్లో ఆందోళన మొదలైంది.

కాంటాక్ట్‌ కలవరం
పెద్దపల్లి జిల్లాలో కాంటాక్ట్‌ కేసులపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 13 మందికి కరోనాసోకగా ఇందులో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఐదుగురు డిశ్చార్జీ కాగా మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఆక్టివ్‌గా ఉన్న ఐదు కేసులు కూడా సుల్తానాబాద్‌కు సంబంధించినవే. రెండురోజులక్రితం సుల్తానాబాద్‌ మండలంలోని కనుకుల గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. అతడి సోదరులు చనిపోయిన సందర్భంలో గ్రామంలోని చాలా మందితో సన్నిహితంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యక్తికి కరోనా నిర్ధారణకావడంతో ఇప్పటికే 16 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. వారిలో కరోనా లక్షణాలు ఉంటే శాంపిళ్లు సేకరించనున్నారు. కాగా ఒకేరోజు జిల్లాకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది.

మరిన్ని వార్తలు